
బలిదానాలతో సాధించిన తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదు కానీ కల్వకుంట్ల కుటుంబం మాత్రం బంగారుమయమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబంలో అందరూ పదవులు అనుభవిస్తున్నారని, దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని స్పష్టం చేశారు.
‘‘నిజాం తరహాలో రాష్ట్రాన్ని కేసీఆర్ పాలిస్తున్నడు. తానే ఒక రాజు అనుకుంటున్నడు. హుజూరాబాద్ లో ఎమ్మెల్యేలు, మంత్రులు డబ్బు సంచులతో, మందు వ్యాన్లలో తిరుగుతున్నరు” అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. హుజూరాబాద్ మండలంలోని సిర్సపల్లి, రాంపూర్, చెల్పూర్, హుజూరాబాద్ పట్టణంలో ఈటల భార్య జమునతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
చెల్పూర్ లోని దళిత కాలనీలో సహపంక్తి భోజనం చేసి, వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం హుజూరాబాద్ టౌన్ లో రోడ్ షో నిర్వహించి మార్కెట్ ఏరియాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఈటలను, ఆయన కుటుంబాన్ని కేసీఆర్ వేధిస్తున్నడు. కేసీఆర్ పాలనను ప్రశ్నించినందుకే ఇట్ల చేస్తున్నడు. నా ప్రజలు నాకు అండగా ఉంటారనే నమ్మకంతో ఈటల ఎన్నికలకు వచ్చారు. ఆయనను ఆశీర్వదించండి” అని ప్రజలను కోరారు.
అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుగా ఉండాలంటే ఈటలను గెలిపించాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రజల గొంతుకగా ప్రశ్నించే గొంతుక కావాలా? కేసీఆర్ కుటుంబానికి అడుగులకు మడుగులొత్తే బానిసగా ఉండే టీఆర్‌ఎస్ అభ్యర్థి కావాలో తేల్చుకోవాలి. కేసీఆర్‌కు ప్రజలపై నమ్మకం లేదు.. డబ్బును నమ్ముకుని ఓటర్లను కొనాలని చూస్తున్నడు” అని విమర్శించారు.
ఊర్లలో అమలవుతున్న పథకాలన్నీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం అందిస్తున్నవేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో ఎల్ఈడీ లైట్స్, పారిశుధ్య కార్మికులకు వేతనాలు, గ్రామాల అభివృద్ధికి ఫండ్స్ మోడీ ఇస్తున్నారని, రేషన్ బియ్యంపై కిలోకు రూ. 30 సబ్సిడీ బీజేపీ ప్రభుత్వమే ఇస్తున్నదని వివరించారు. అయితే కానీ కేసీఆర్ మాత్రం సొంత ఫొటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
కేంద్రమే కరోనాకు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తోందని, భూసార పరీక్షలు చేయడానికి రైతులకు కార్డులు ఇస్తోందని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తోందని చెప్పారు. బడుల్లో యూనిఫామ్ ఇచ్చేది, మధ్యాహ్నం భోజనం పెట్టేది కూడా కేంద్రమేనని తెలిపారు.
ఏడేండ్లుగా పావలా వడ్డీ పైసలు మహిళలకు రాలేదని గుర్తు చేస్తూ ఇప్పుడు వడ్డీ వస్తుందంటే అది ఈటల వల్లేనని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈటల కారణంగానే దళిత బంధు వచ్చిందని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ ను, ఈటల జమునను జైల్లో పెట్టాలని రాష్ట్ర సర్కారు కుట్ర చేస్తోందని కేంద్ర మంత్రి ఆరోపించారు.
హుజూరాబాద్ బిడ్డ ఈటలను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. హుజూరాబాద్ లో సభ పెట్టలేకనే సీఎం కేసీఆర్ ప్లీనరీ పేరు మీద హైదరాబాద్ లో సభ పెట్టుకున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘ఈటల ముఖాన్ని అసెంబ్లీ లో చూడనన్న కేసీఆర్ ముఖాన్ని కూడా అసెంబ్లీకి రాకుండా చేయాలి” అని కోరారు. సీఎం కుర్చీని, హుజూరాబాద్ ను లెక్కచేయని కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని ఆయన హెచ్చరించారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం