బంగ్లాదేశ్‌లో ముస్లిమేతరులపై ఆగని దాడులు

బంగ్లాదేశ్‌లో ముస్లిమేతరులపై ఆగని దాడులు

బంగ్లాదేశ్‌లో ముస్లిమేతరులపై దాడులు ఆగడం లేదని వరల్డ్ హిందూ ఫెడరేషన్ బంగ్లాదేశ్ శాఖ ఆవేదన వ్యక్తం చేసింది. అక్టోబరు 13న ప్రారంభమైన దాడులపై పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నప్పటికీ ఆదివారం కాక్స్ బజార్ జిల్లాలోని కటఖలి ఫారెస్ట్ బుద్ధిస్ట్ మోనస్టరీని తగులబెట్టారని, ఈ దారుణ సంఘటనలో 15 మంది బౌద్ధ చక్మాలు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది.

బంగ్లాదేశ్‌వ్యాప్తంగా హిందువులు అత్యంత దారుణమైన దాడులకు గురవుతున్నారని తెలిపింది. అక్టోబరు 13 నుంచి ప్రారంభమైన హింసాకాండలో 35కుపైగా జిల్లాల్లో 335 దేవాలయాలు, 1,650 హిందువుల ఇళ్ళు, దుకాణాలను ధ్వంసం చేశారని పేర్కొంది. ఏడుగురు హిందూ పూజారులు, ఏడుగురు హిందువులు హత్యకు గురయ్యారని తెలిపింది. 

17 మంది హిందువుల జాడ తెలియడం లేదని పేర్కొంది. 26 మంది హిందూ మహిళలు, బాలికలపై అత్యాచారాలు చేశారని పేర్కొంది. బాధితుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపింది. పదేళ్ళ హిందూ బాలికపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారని పేర్కొంది. 

హిందువులపై దాడులను నివారించేందుకు ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. దుర్గా పూజ మండపంలోని ఆంజనేయుడి విగ్రహం వద్ద ఖురాన్‌ను పెట్టిన వ్యక్తి ఇక్బాల్ అని బంగ్లాదేశ్ పోలీసులు గుర్తించినప్పటికీ, అతని చర్యను ఇస్లామిక్ సంస్థలు ఖండించలేదని తెలిపింది. 

బంగ్లాదేశ్ లౌకికవాద సౌభాగ్యవంతమైన దేశంగా ఉండాలని కోరుకుంటున్నారా? లేదంటే పాకిస్థాన్ క్రింద ఉన్నప్పటి దేశంగా వెనుకకు వెళ్ళాలని కోరుకుంటున్నారా? ప్రభుత్వం అనే విషయాన్ని స్పష్టం చేయాలని కోరింది. 

దాడుల నిందితుడు.. అధికార పార్టీ కార్యకర్త

ఇలా ఉండగా, బంగ్లాదేశ్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన షైకత్‌ మండల్‌ నేరాన్ని అంగీకరించాడు. ఇతడు.. అధికార అవామీ లీగ్‌ పార్టీ విద్యార్థి విభాగం ఛత్రా లీగ్‌ నేత. ఈ కేసులో అరెస్టయిన అనంతరం షైకత్‌ను బహిష్కరించారు. 

ఫేస్‌బుక్‌లో ఫాలోవర్లను పెంచుకునేందుకే అభ్యంతరకర సమాచారాన్ని పోస్ట్‌ చేశానని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారని ఓ వెబ్‌సైట్‌ వెల్లడించింది. వివాదాస్పద పోస్టు నేపథ్యంలో ఈ నెల 17న దుర్గా పూజ సందర్భంగా పీర్‌గంజ్‌లోని రంగపూర్‌లో హింస చోటు చేసుకుంది. 

కొందరు హిందువుల ఇళ్లు తగలబెట్టడంతో పాటు లూటీ చేశారు. దాదాపు 70ఇళ్లు తగులబెట్టారు. ఈ ఘటనలకు సంబంధించి షైకత్‌ మండల్‌తో పాటు మతబోధకుడు రబీయుల్‌ ఇస్లాంను శుక్రవారం అరెస్టు చేశారు. తమ ఫేస్‌బుక్‌ పోస్టే హింసకు కారణమని వీరు ఆదివారం కోర్టులో అంగీకరించారు.

శుక్రవారం ప్రార్థనల సందర్భంగా లౌడ్‌ స్పీకర్లలో ఇస్లాం గ్రామంలోని ముస్లింలను రెచ్చగొట్టాడని పోలీసులు వెల్లడించారు. ఇప్పటిదాక ఏడుగురు నేరాన్ని అంగీకరించారని, 683 మందిని అరెస్టు చేశామని, మరో 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పెట్రోల్‌ చల్లి, ఇళ్లకు నిప్పంటించాడని భావిస్తున్న మామున్‌ మోండల్‌ అనే నిందితుడు, తాజాగా అరెస్టు చేసిన వారిలో ఉన్నాడని పేర్కొన్నారు. తనపై ఆరోపణల్ని మామున్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది.