తెలంగాణ కార్మికశాఖలో రూ.670 కోట్లు గోల్‌మాల్

తెలంగాణ కార్మికశాఖలో రూ.670 కోట్లు గోల్‌మాల్
తెలంగాణ ప్రభుత్వ కార్మికశాఖలో  రూ.670 కోట్లకు లెక్కలు తేలడం లేదు. కరోనా మహమ్మారి సమయంలో  నిర్మాణ కార్మికులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, కుటుంబానికి  రూ.1500  నగదు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా రూ. 258 కోట్లు  కార్మికులకు, వలస కూలీలకు  నగదు అందజేసినట్లు కార్మిక శాఖ చెబుతోంది. 
మిగిలిన డబ్బు పౌరసరఫరాల శాఖ  నుంచి రావాల్సి ఉందని తెలంగాణ బిల్డింగ్  అండ్  అదర్  కన్ స్ట్రక్షన్  వర్కర్స్  వెల్ఫేర్ బోర్డు  తెలిపింది. అయితే  తమకు బిల్డింగ్  అండ్  అదర్  కన్ స్ట్రక్షన్  వర్కర్స్  వెల్ఫేర్  బోర్డు  నుంచి నేషనల్  ఫుడ్ సెక్యూరిటీ యాక్టు సెక్షన్ కు  ఎలాంటి నిధులూ  రాలేదని  పౌరసరఫరాల శాఖ చెబుతోంది. 
 
ఉచిత బియ్యంతో పాటు  నగదు సాయం  కోసం రూ.335 కోట్లను పౌరసరఫరాల  శాఖకు  రీయింబర్స్  చేయాలని  లేబర్ ఎంప్లాయిమెంట్  ట్రైనింగ్  అండ్ ఫ్యాక్టరీస్  శాఖ కార్యదర్శికి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు లేఖ  రాశారు. 
 
దీంతో పాటు  భవిష్యత్ లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మరో రూ.699. 88 కోట్లు  అడ్వాన్స్ గా  జనరల్  అండ్  అదర్ రెవెన్యూ ఫండ్స్ , డిజాస్టర్  రెస్పాన్స్  ఫండ్ , స్టేట్  డిజాస్టర్ రెస్పాన్స్  ఫండ్ , కాంట్రీబూషన్  టు  స్టేట్  డిజాస్టర్  రెస్పాన్స్ ఫండ్  ఖాతాలకు జమ చేయాలని  ఆదేశించారు. దీంతో  వెయ్యి ఐదు  కోట్లను  కార్మిక శాఖ నుంచి పౌరసరఫరాల శాఖకు అధికారులు బదిలీ చేశారు.
 
కానీ సదరు  పౌరసరఫరాల శాఖ మాత్రం నిధులెక్కడివని  అంటోంది. అయితే, ఈ నిధులు  ఎక్కడికి వెళ్లాయి? ఎవరు ఖర్చుచేశారు? మిగిలిన నిధులు ఎవరి దగ్గర ఉన్నాయి? అనే ప్రశ్నలకు సమాధానం లేదు.  తమ నిధులను  తిరిగి చెల్లించాలని పౌరసరఫరాల శాఖకు కార్మిక శాఖ  అధికారులు ఐదుకు పైగా లేఖలు రాసినట్టు  తెలుస్తోంది. 
 
కాగా, ఈ విషయాన్ని అధికారులు  బయటికి  రానివ్వడం లేదు. దీతో  కార్మిక శాఖలో రూ.670 కోట్లు ఏమైయ్యాయనేది అనుమానాలకు  తావిస్తోంది. మరోవైపు  చాలా నిర్మాణ రంగ సంస్థలు ప్రభుత్వానికి సెస్ ఎగ్గొట్టినట్లు విజిలెన్స్ కమిటి నివేదిక ఇచ్చింది. 
 
తెలంగాణ  రాక  ముందు వంద కోట్లు.. రాష్ట్రం ఏర్పడ్డాక  దాదాపు రూ.900 కోట్ల  సెస్ ….ఇప్పటివరకు వసూలు  కాలేదని  నివేదికను బట్టి  తెలుస్తోంది. దాదాపు వెయ్యి కోట్ల  సెస్  ఎగ్గొట్టినట్లు విజిలెన్స్ నివేదిక ఇచ్చినా  ప్రభుత్వం పట్టించుకోలేదన్న  విమర్శలున్నాయి.