బాల్య వివాహాలను చట్టబద్ధం చేసేలా రాజస్థాన్ 

బాల్య వివాహాలను చట్టబద్ధం చేసేలా రాజస్థాన్ 

రాజస్తాన్‌ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన రాజస్తాన్‌ వివాహాల తప్పనిసరి రిజిస్ట్రేషన్‌ చట్టం – 2009 సవరణ బిల్లుపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సిపిసిఆర్‌) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ బిల్లు బాల్య వివాహాలను చట్టబద్ధం చేసేలా ఉందని, ఇది మైనర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. 

దీనిపై వెంటనే సమీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎన్‌సిపిసిఆర్‌ చైర్‌పర్సన్‌ ప్రియాంక కనూంగో లేఖ రాశారు. బాల్య వివాహాలను నిషేధిస్తున్న కేంద్ర  ప్రభుత్వ చట్టంపై ఈ బిల్లు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆమె చట్టం చేశారు. 

 ” 21 సంవత్సరాలు పూర్తికాని పెండ్లికుమారుడు, 18 ఏళ్లు నిండని వధువుకు జరిగిన వివాహాన్ని 30 రోజుల్లోపు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు నమోదు చేయించాలని బిల్లు పేర్కొంటోంది. ఇది బాల్య వివాహాలను చట్టబద్ధం చేసేలా ఉంది” అని లేఖలో పేర్కొన్నారు. 

ఈ బిల్లు మైనర్ల విద్యతో పాటు వారి శారీరక, మానసిక, సామాజిక స్థితిగతులపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారుల సంక్షేమం, ఇతర చట్టాలకు అనుగుణంగా ఈ బిల్లులోని నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమీక్ష చేయాలని ఆమె కోరారు. 

సవరించిన నిబంధనలు మైనర్ల వివాహ సంబంధాల స్థితిని మార్చకుండా, వివాహాల నమోదు ప్రక్రియను మాత్రమే క్రమబద్ధీకరిస్తాయని రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పేర్కొంటోంది.  బిజెపి, పలు  పౌరసమాజ సంస్థల అభ్యంతరాలను లెక్కచేయకుండా రాజస్థాన్ అసెంబ్లీలో ఈ బిల్లును సెప్టెంబర్ 17న ఆమోదించారు.