పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ తరాలకు జీవనానుకూల పరిస్థితులను కల్పించేందుకు వీలుంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇంతటి విలువైన పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రజలను చైతన్య పరిచే విషయంలో ప్రభుత్వాలు చేస్తున్న కృషితోపాటు శాస్త్రవేత్తలు, పరిశోధకులు ముందుకు రావాలని ఆయన సూచించారు.
ఆదివారం సీఎస్ఐఆర్ (శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి) 80వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటూ వ్యవసాయ రంగంతోపాటు పర్యావరణం, కాలుష్యం, వివిధ ఆరోగ్య సమస్యల పరిష్కారం తదితర అంశాల్లో సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు, ప్రయోగశాలలు పోషిస్తున్న పాత్రను అభింనదించారు.ఈ దిశగా మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
వ్యవసాయ రంగం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి సరైన పరిష్కారాలు కనుగొనేదిశగా కృషిచేయాలన్న ఉపరాష్ట్రపతి, ఈ దిశగా యువ శాస్త్రవేత్తలు వినూత్నమైన ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు. కరోనా ప్రపంచానికి కనిపించిన ఒక సమస్యేనన్న ఉపరాష్ట్రపతి, ఇలాంటి ఎన్నో సమస్యలు, సవాళ్లు సమాజం ముందున్నాయని పేర్కొన్నారు.
ప్రతి సీఎస్ఐఆర్ ప్రయోగశాల సరికొత్త పరిష్కారంతో ముందుకు రావాలని ఆయన సూచించారు. అంతరిక్షం, అణుశక్తి, సముద్ర విజ్ఞానం, రక్షణ పరిశోధన తదితర అంశాల్లో భారతదేశం ఎంతో ప్రగతిని సాధిస్తోందన్న ఆయన, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఆయా రంగాలతోపాటు విశ్వమానవాళికి మేలుచేసే మరిన్ని పరిశోధనలపై దష్టిసారించడం ద్వారా ప్రపంచ పరిశోధనారంగంలో భారతదేశాన్ని మొదటిస్థానంలో నిలపారని కొనియాడారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో సీఎస్ఐఆర్ సహా భారతీయ శాస్త్రవేత్తలు చూపిన చొరవ కారణంగానే భారతదేశం పెను ప్రభావం నుంచి బయటపడిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువ శాస్త్రవేత్తలు, సీఎస్ఐఆర్ ఇన్నొవేషన్ అవార్డ్స్ ఫర్ స్కూల్ చిల్డ్రన్ సహా వివిధ విభాగాల్లో అవార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో మహిళల సంఖ్య గణనీయంగా ఉండటాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

More Stories
ధైర్యం, కరుణ, త్యాగాలకు గురు గోవింద్ సింగ్ ప్రతిరూపం
బంగ్లాలో హిందువులపై దాడుల పట్ల భారత్ లో ఆగ్రవేశాలు
ఎర్రకోట పేలుడులో 40 కిలోల పేలుడు పదార్థాలు