రక్షణ శాఖ 56 సీ-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.20 వేల కోట్లు. ఇందులో భాగంగా మొత్తం 56 విమానాలలో 16 ఎయిర్‌క్రాఫ్ట్‌లను 48 నెలల్లో ఎగరడానికి సిద్ధంగా ఉన్న కండిషన్‌లో ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఇస్తుంది.
ఇక మిగతా 40 విమానాలను ఇండియాలోనే టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌తో కలిసి ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ తయారు చేస్తుంది. చివరి విమానం 10 ఏళ్ల తర్వాత వాయుసేనకు అందనుంది. భారత్‌లో ఈ విమానాల తయారీ నాలుగైదేళ్లలో మొదలు కానుంది. ట్రాన్స్‌పోర్ట్ కాన్ఫిగరేషన్, స్వదేశీ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌తో ఈ విమానాలను అందించనున్నారు. “భారత వాయుసేన విమానాల ఆధునీకరణలో ఇదో ముందడుగు” అని ప్రభుత్వం తెలిపింది. ఈ సీ-295 ఎండబ్ల్యూ ఎయిర్‌క్రాఫ్ట్ సామర్థ్యం 5-10 టన్నులు. దీనిని రవాణా కోసం ఉపయోగిస్తారు.
ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్న ఏవీఆర్‌వో-748ల స్థానంలో వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీ భారత్ లో మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారు చేసే తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఈ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది.
ఈ ప్రతిపాదనకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ రెండు వారాల క్రితమే ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఎ భరత్ భూషణ్ బాబు ఇచ్చిన ట్వీట్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ , స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ మధ్య ఒప్పదం కుదిరినట్లు తెలిపారు. 56 సి295 విమానాలను వాయుసేన కోసం సేకరిస్తున్నట్లు తెలిపారు.
టాటా ట్రస్టుల ఛైర్మన్ రతన్ టాటా, ఎయిర్‌బస్ డిఫెన్స్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, భారత రక్షణ మంత్రిత్వ శాఖలను అభినందించారు, భారతదేశంలో ఏవియేషన్, ఏవియోనిక్స్ ప్రాజెక్ట్‌లను తెరవడంలో ఇది గొప్ప ముందడుగు అని అభివర్ణించారు. ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ ప్రమాణాలకు దేశీయ సరఫరా గొలుసు సామర్థ్యాన్ని సృష్టిస్తుందని, ఇది గతంలో ఎన్నడూ చేపట్టలేదని ఆయన ఓ ట్వీట్ లో తెలిపారు.
“సి-295 అనేది మిషన్ అవసరాలను తీర్చడానికి అనేక కాన్ఫిగరేషన్‌లతో కూడిన బహుళ-పాత్ర విమానం. ఇది భారతదేశంలో విమానాల మొత్తం తయారీని ఊహించింది,” అని ఆయన చెప్పారు. “ఈక్విటీ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి మేక్-ఇన్-ఇండియా థ్రస్ట్‌కు మద్దతుగా భారతదేశంలో ఈ అత్యాధునిక మల్టీ-రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పూర్తిగా నిర్మించడంలో ఈ సాహసోపేతమైన చర్యకు టాటా గ్రూప్, ఎయిర్‌బస్, భారత రక్షణ మంత్రిత్వ శాఖను అభినందిస్తోంది” అని టాటా చెప్పారు.
“ఈ ఒప్పందం భారతదేశ ఏరోస్పేస్ పర్యావరణ వ్యవస్థ మరింత అభివృద్ధికి తోడ్పడుతుంది, రాబోయే 10 సంవత్సరాలలో పెట్టుబడి తీసుకు రావడమే కాకుండా 15,000 నైపుణ్యం కలిగిన ప్రత్యక్ష ఉద్యోగాలు, 10,000 పరోక్ష స్థానాలను అందిస్తుంది” అని ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సిఇఒ మైఖేల్ స్కోల్‌హార్న్ పేర్కొన్నారు.
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఎండి, సిఇఒ సుకరన్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విమానాల ఉతత్తికిగాను 100కుపైగా సైట్లను పరిశీలించనున్నామని తెలిపారు. కాగా ఎయిర్‌బస్ దక్షిణాసియా అధ్యక్షుడు, ఎండి రేమీ మిల్లార్డ్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ కేవలం సాంకేతిక బదిలీయేకాక ఇంకా చాలా అభిలాషలున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు భారత్‌ను ప్రపంచ తయారీ పటంలో ఉంచగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
More Stories
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు