
అఫ్గానిస్థాన్‌ను చెర పట్టిన తాలిబాన్లు ఆ దేశంలో మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. మహిళల స్వేచ్ఛకు, వాళ్లు ఉద్యోగాలు చేయడానికి బద్ధ వ్యతిరేకులైన తాలిబాన్లు ఇప్పుడు అరాచకాలకు దిగుతున్నారు. ప్రపంచం భయపడుతున్నట్లుగానే ఆఫ్ఘనిస్తాన్‌లో అరాచకం మొదలైంది.
తమకు కాదని అప్పటి ప్రభుత్వానికి, అమెరికా సేనలకు బాసటగా నిలిచిన వారిని తాలిబాన్ టార్గెట్ చేసుకుంటున్నది. ఇప్పటికే పలువురిని గుర్తించినట్లు వార్తలు రాగా.. తాజాగా మాజీ మహిళా పోలీసు అధికారిని దారుణంగా హత్య చేశారు. ఎనిమిది నెలల గర్భవతి అని కూడా చూడకుండా ఆమెను పాశవికంగా చంపడంపై సర్వత్రా నిరసన గళాలు వినిపిస్తున్నాయి.
దాంతో ఘటనను ఖండిస్తున్నట్లు తాలిబాన్ ప్రతినిధి ప్రకటించడమే కాకుండా.. విచారణ జరుపుతామని వెల్లడించారు. ఘోర్ ప్రావిన్స్‌లోని ఫిరోజ్‌కోహ్‌లో నివాసముందే బాను నిగర్ గతంలో పోలీసు అధికారిగా పనిచేశారు. ఆమె ప్రస్తుతం 8 నెలల గర్భవతి. గతంలో ప్రభుత్వానికి తమపై ఫిర్యాదు చేసేవారన్న కోపంతో ఆమెను తాలిబాన్ మట్టుబెట్టినట్లు బీబీసీ తన కథనంలో పేర్కొన్నది.
కుటుంబసభ్యులు చూస్తుండగానే ఆమెను వీధిలోకి లాక్కొచ్చి తుపాకీతో తలపై కాల్చి చంపారని, ఆమెను లాక్కొచ్చిన ముగ్గురు అరబిక్ భాషలో మాట్లాడినట్లు స్థానికులు చెప్పారని బీబీసీ తెలిపింది. ఈ వీడియోను పదేపదే ప్రదర్శిస్తూ తమకు వ్యతిరేకంగా నడుచుకునే వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నారు.
షరియత్ చట్టం ప్రకారమే మహిళలు నడుచుకోవాలని తాలిబాన్ ఆదేశిస్తున్నది. అయితే, ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవడంతో ఖండిస్తున్నట్లు తాలిబాన్ ప్రకటించింది. అలాగే, దీనిపై విచారణ జరుపుతామని కూడా పేర్కొన్నది. 1996 నుంచి 2001 వరకు ఆఫ్ఘన్‌ను పాలించిన తాలిబాన్.. మహిళలకు విద్యతో పాటు ఎలాంటి హక్కులు ఇవ్వలేదు. శనివారం కాబూల్‌లో వందలాది మంది మహిళలు తాలిబాన్‌కు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు.
సంగీత పరికరాల ధ్వంసం
మరోవంక, ఆఫ్ఘన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక పలు రికార్డింగ్ స్టూడియోల్లోని సంగీత వాయిద్య పరికరాలను ధ్వంసం చేశారు.కాబూల్ నగరంలోని స్టేట్ రికార్డింగ్ స్టూడియోల్లో తాలిబన్ గార్డులు రెండు గ్రాండ్ పియానోలు, ఇతర సంగీత వాయిద్యాలను ధ్వంసం చేశారు. కాందహార్ నగరంలోని టెలివిజన్, రేడియో ఛానెళ్లలో సంగీతం, స్త్రీ గాత్రాలను తాలిబన్లు నిషేధించారు.
సెప్టెంబరు 4వతేదీన సాయుధ తాలిబన్ గార్డు అఫ్ఘానిస్థాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్‌ను మూసివేశారు. తాలిబన్ ఫైటర్ లోయలో ఉన్న అఫ్ఘాన్ జానపద గాయకుడు ఫవాద్ అండరాబిని ఆగస్టు చివరి వారంలో కాల్చి చంపాడు. ఇస్లాంలో సంగీతం నిషేధించారని, ప్రజలు సంగీత కార్యక్రమాల్లో పాలుపంచుకోవద్దని తాము కోరతామని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పారు. కాబూల్ నగరంలోని రికార్డింగ్ స్టూడియోలలోని సంగీత వాయిద్యాలకు జరిగిన నష్టంతో సంగీతంపై తాలిబన్ల వైఖరి స్పష్టమవుతోంది.
More Stories
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!