చెక్కుల ద్వారా చెల్లింపుల్లో మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ ‘పాజిటివ్ పే’ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో చెక్కు జారీ చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారం, చెక్కు డ్రా చేసుకొంటున్న వ్యక్తి ఇచ్చిన సమాచారం సరిపోలితేనే అధికారులు చెక్కును క్లియర్ చేస్తారు. లేకపోతే నిలిపివేస్తారు. 
చెక్కు జారీచేసే వ్యక్తి ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ఇలా పలు మార్గాల ద్వారా వివరాలను బ్యాంకుకు తెలుపవచ్చు. చెక్కు జారీ చేసిన వ్యక్తికి తెలియకుండా వాటిల్లో పేర్లు, అంకెలు మార్చి ఎక్కువ నగదును విత్డ్రా చేసుకొంటున్న ఘటనల నేపథ్యంలో ఆర్బీఐ ఈ విధానాన్ని తీసుకువచ్చింది. 
ఒక విధంగా చెప్పాలంటే ఇది రీ కన్ఫర్మేషన్ ద్వారా చెక్కులను క్లియర్ చేయడం అన్నమాట. పాజిటివ్ పే విధానంలో చెక్కు జారీ చేసే వ్యక్తి ముందుగా చెక్కు నంబర్, ఎవరి పేర ఇస్తున్నాడో వారి పేరు, నగదు మొత్తం, చెక్కు జారీ చేసిన తేదీ తదితర వివరాలను బ్యాంకుకు తెలియజేయాలి. 
చెక్కును తీసుకొన్న వ్యక్తి దాని క్లియరెన్స్ కోసం వెళ్లినప్పుడు పై వివరాలను చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్-చెక్కు మార్పిడి వ్యవస్థ) ద్వారా పరిశీలిస్తారు. ఇద్దరి వివరాలు సరిపోలితే చెక్కు క్లియర్ చేస్తారు. ఈ విధానాన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. 
అయితే, రూ.5లక్షల లోపు చెక్కులకు పాజిటివ్ పే విధానాన్ని అమలు చేయడం అనేది బ్యాంకులు, ఖాతాదారుల ఇష్టం. ఖాతాదారులు కోరుకొంటే బ్యాంకులు అమలు చేయవచ్చు. కానీ చెక్కు విలువ రూ.5 లక్షలు దాటితేమాత్రం పాజిటివ్ పే విధానం తప్పనిసరి. చెక్కుజారీ చేసిన వ్యక్తి వివరాలు ఇవ్వకపోతే చెక్కు బౌన్స్ కావచ్చు. ఇప్పటికే యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ లాంటి కొన్ని బ్యాంకులు పాజిటివ్ పే విధానాన్ని అమలు చేస్తున్నాయి.
                            
                        
	                    
More Stories
టాటా ట్రస్ట్స్ పై న్యాయపోరాటంకు మెహ్లీ మిస్త్రీ
దేశ ఆర్థిక వ్యవస్థపై టెక్ రంగంలో లేఆఫ్స్ ప్రభావం
షట్డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం