తాలిబన్‌ జిల్లా చీఫ్‌ సహా మరో 50 మంది హతం

ఆఫ్ఘనిస్తాన్‌లోని దక్షిణ ప్రాంతంలోని ఆండ్రాబ్‌ ప్రావిన్స్‌లో తాలిబాన్-ఆఫ్ఘన్ సైన్యం మధ్య భీకర పోరు ప్రారంభమైంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ వశం కాకుండా ఉన్న ఏకైక ప్రాంతమైన పంజ్‌షీర్‌లో పోరాటం ప్రమాదకరమైన మలుపు వైపు వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నది.

ఇప్పటికే 300కిపైగా తాలిబన్లను మట్టుబెట్టిన అహ్మద్ మసూద్ నేతృత్వంలోని పంజ్‌షీర్‌ రెబెల్స్‌.. అంద్రాబ్ ప్రాంతంలో సోమవారం జరిగిన ప్రతిఘటన దాడుల్లో తాలిబన్‌ బాను జిల్లా చీఫ్‌ సహా మరో 50 మంది తాలిబన్‌ ఫైటర్లను అంతమొందించారని తెలుస్తుంది. మరో 20 మంది తాలిబన్లను రెబెల్స్‌ ఫోర్స్‌ బందీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 

ఈ దాడుల్లో ఓ రెబల్‌ ఫైటర్‌ సైతం మరణించినట్లు మరో ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. తాలిబన్‌ సైన్యం భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ ఫ్రావిన్స్‌ను చుట్టుముట్టినప్పటికీ.. చర్చల ద్వారానే సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని పంజ్‌షీర్‌ ప్రజలు ప్రకటించడం విశేషం. 

మరోవైపు తాలిబన్లతో పోరులో పంజ్‌ షీర్‌ ఫైటర్స్‌కు ఆఫ్ఘన్ సైన్యం మద్దతుగా నిలబడింది. తాలిబన్లు, అఫ్గాన్‌ సైన్యం మధ్య భీకర పోరుతో ఆ దేశ దక్షిణ ప్రాంతంలోని ఆంద్రాబ్‌ ఫ్రావిన్స్‌  అల్లకల్లోలంగా మారింది.

పంజ్‌షీర్ లోయలో తిరుగుబాటుదారులకు నాయకత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్ యోధులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఆఫ్ఘన్ సైన్యం కూడా వారితో పాలుపంచుకుంటున్నది. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్, నార్తర్న్ అలయన్స్‌కు నాయకత్వం వహిస్తున్న అహ్మద్‌ మసూద్  యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇదేసమయంలో, చర్చలు జరిగితే అందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు.

తాలిబన్లపై సేనల దాడులు చేసే సమయంలో పౌరులు కూడా సాయపడ్డట్టు తెలుస్తున్నది. మరోవైపు, తాలిబన్లు, వారి వ్యతిరేకుల మధ్య జరిగే ఘర్షణల్లో జోక్యం చేసుకోబోమని రష్యా వెల్లడించింది. పంజ్‌షీర్‌ ప్రావిన్సును తాలిబన్లు చుట్టుముట్టారు. లోయతో పాటు, ప్రావిన్సు అన్ని దిశల్లో తమ దళాల్ని మోహరించినట్టు తాలిబన్‌ నేతలు ప్రకటించారు.

అయితే, పంజ్‌షీర్‌ వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించారు. మరోవైపు, భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వాహనాలతో లోయను ఇప్పటికే వేలాది మంది తాలిబన్లు చుట్టుముట్టినట్టు అఫ్గానిస్థాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు, తనకు తాను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సాలేహ్‌ ధ్రువీకరించారు. తాలిబన్లు ఎంతగా భయాందోళనలకు గురిచేసినా.. ఎట్టిపరిస్థితుల్లో తలవంచేది లేదని ఉత్తర కూటమి ప్రకటించింది. 

మరోవైపు, సోమవారం కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒక అఫ్గాన్‌ సైనికుడు మరణించాడు. ఇదిలాఉండగా. తమ పాలనను అంతర్జాతీయ సమాజం అంగీకరించాలని, అందుకే తాలిబన్లు పలు హామీలను ఇస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ఈ క్రమంలో ‘తాలిబన్లను మీరు విశ్వసిస్తారా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తాను ఎవరినీ నమ్మబోనని స్పష్టం చేశారు.

అఫ్గాన్‌ నుంచి చివరి అమెరికా పౌరుడిని తరలించేంత వరకు బలగాల ఉపసంహరణ చేపట్టబోయేది లేదని వెల్లడించారు. ఆగస్టు 31 తర్వాత కూడా తరలింపు ప్రక్రియ పూర్తవ్వకపోతే, బలగాలను ఉపసంహరణ ప్రక్రియను వాయిదా వేస్తామన్నారు.

దీనిపై తాలిబన్‌ నేతలు స్పందిస్తూ ఆగస్టు 31లోపు అమెరికా బలగాలను ఉపసంహరించకపోతే, తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తుందని, ఈ తేదీనే వారికి ‘రెడ్‌లైన్‌’ అని హెచ్చరించారు. అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తయ్యాకనే, ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందని తెలిపారు.