ఆరుగురు టిఎంసి రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్

ఆరుగురు టిఎంసి రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్
రాజ్య‌స‌భ‌  కు చెందిన ఆరుగురు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ  ఎంపీల‌ను చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు స‌స్పెండ్ చేశారు. పెగాస‌స్ వ్య‌వ‌హారంపై చ‌ర్చ చేపట్టాల‌ని వెల్‌లోకి దూసుకువ‌చ్చిన ప్లకార్డులు ప్ర‌ద‌ర్శించిన ఘ‌ట‌న‌లో ఆ ఎంపీల‌ను బ‌హిష్క‌రించారు. ఒక రోజు పాటు వారిపై స‌స్పెన్ష‌న్ విధించారు. 
 
స‌స్పెండ్ అయిన‌వారిలో డోలాసేన్‌, న‌దీముల్ హ‌క్‌, అబిర్ రంజ‌న్ బిశ్వాస్‌, శాంతా చెత్రి, అర్పితా ఘోష్‌, మౌస‌మ్ నూర్‌లు ఉన్నారు. ఈ ఆరుగురు ఎంపీలు రాజ్య‌స‌భ వెల్‌లోకి వ‌చ్చార‌ని, చైర్ ఆదేశాల‌ను ధిక్క‌రిస్తూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించార‌ని, ఇవాళ ఉద‌యం వీరి ప్ర‌వ‌ర్త‌న స‌భ‌లో స‌రిగాలేద‌ని, రూల్ 225 ప్ర‌కారం వారిపై ఒక రోజు స‌స్పెష‌న్ విధిస్తున్న‌ట్లు రాజ్య‌స‌భ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.
 
విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న‌ల‌తో ఇవాళ ఉద‌యం రెండు సార్లు రాజ్య‌స‌భ వాయిదా ప‌డింది. ఆ స‌మ‌యంలోనే కొంద‌రు ఎంపీల‌పై చర్య‌లు తీసుకోనున్న‌ట్లు వెంక‌య్య హెచ్చరించారు. 

ఇలా ఉండగా, పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో ప్ర‌తిష్ఠంభ‌న కొన‌సాగుతూనే ఉంది. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో వాయిదాల ప‌ర్వం య‌ధావిధిగా జ‌రుగుతోంది. పెగాస‌స్ స్పైవేర్ అంశంపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్ష పార్టీలు చేస్తున్న ఆందోళ‌న‌తో ఉభ‌య‌స‌భ‌ల్లోనూ కార్య‌క్ర‌మాలు స‌రిగా జ‌ర‌గ‌డం లేదు. 

రెండు వారాల నుంచి పార్ల‌మెంట్‌లో ఇదే సీన్ కొన‌సాగుతోంది. ప్ర‌భుత్వం కొన్ని బిల్లుల‌ను పాస్ చేసినా.. ఏ అంశంపైనా రెండు స‌భ‌ల్లోనూ చ‌ర్చ‌లు మాత్రం సాగ‌డం లేదు. బ‌ధువారం కూడా లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లు ప‌లుమార్లు వాయిదా ప‌డ్డాయి. రాజ్య‌స‌భ‌లో సాగు చ‌ట్టాల అంశంపై రూల్ 267 కింద చర్చ చేప‌ట్టేందుకు అంగీక‌రిస్తున్న‌ట్లు చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు తెలిపారు. ఇది చాలా కీల‌క‌మైన అంశ‌మ‌ని, అందుకే అవ‌కాశం ఇస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 

కానీ విప‌క్ష స‌భ్యులు మాత్రం వెల్‌లోకి దూసుకువెళ్లి ఆందోళ‌న చేప‌ట్టారు. పెగాస‌స్ వ్య‌వ‌హారంపై చ‌ర్చించాల‌ని డిమాండ్ చేశారు. అయితే వెల్‌లోకి వ‌చ్చే ఎంపీల‌ను స‌స్పెండ్ చేస్తాన‌ని చైర్మ‌న్ హెచ్చ‌రించారు. అయినా స‌భ్యులు విన‌లేదు. దీంతో స‌భ‌ను 2 గంట‌ల‌కు వాయిదా వేశారు. ఇక లోక్‌స‌భ కూడా మూడుసార్లు ఇవాళ వాయిదా ప‌డింది.