
సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు, పేపర్లను చింపేసి స్పీకర్ వైపు విసిరేసిన కాంగ్రెస్ సభ్యులపై స్పీకర్ ఓంబిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారందర్నీ సస్పెండ్ చేసేందుకు నోటీసులు జారీ చేశారు. వర్షాకాల సమావేశాలకు మొత్తానికీ సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
విపక్ష సభ్యులెవరైనా… సభలో ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యాలకు పాల్పడితే, వారిని కూడా సస్పెండ్ చేస్తామని స్పీకర్ తీవ్రంగా హెచ్చరించారు. సస్పెండ్ చేసిన ఎంపీల జాబితాలో మాణిక్కం ఠాగూర్, డీన్ కురియకోసే, హిబీఈడెన్, ఎస్. జ్యోయిమణి, రవ్‌నీత్ బిట్టు, గుర్జీత్ అవుజా, టీఎన్ ప్రతాపన్, వైతిలింగమ్, సప్తగిరి శంకర్, ఏఎమ్ ఆరిఫ్, దీపక్ బైజ్ ఉన్నారు.
వీరందరిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పెగాసస్ వ్యవహారంతో పాటు ఇతర వ్యవహారాలపై ప్రతిపక్ష పార్టీలు ఉదయం నుంచి సభలో నిరసనకు దిగారు. దీంతో మూడు సార్లు సభ వాయిదా పడింది. గందరగోళ మధ్య స్పీకర్ ప్రస్నోత్తరాలను కొనసాగిస్తుండగా కాంగ్రెస్, టిఎంసీ, ఇతర ప్రతిపక్షాల సభ్యులు నినాదాలు చేస్తున్నారు. వెల్ లో నుంచొని, ప్లే కార్డులు ప్రదరహిస్తూ, నినాదాలు ఇస్తుండడంతో 12.05 గంటలకు సభను మధ్యాన్నాము 12.30 గంటలకు వాయిదా వేసేటట్లు చేశారు.
ఓ దశలో కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు సభా కార్యక్రమాల పత్రాలను అధికారులు, స్పీకర్ పైకి విసిరి వేశారు. కొందరు విపక్ష ఎంపీలు చైర్‌పైకి పేపర్లు విసిరేశారు. ఈ ఘటన పట్ల స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సభ్యులు, ఐటి వ్యవహారాల సభా కమిటీ చైర్మన్ శశి థరూర్ పై సభా హక్కుల తీర్మానం కోసం బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబే నిలబడి నోటీసు చదవడం ప్రారంభించాడు. ఆ కమిటీ చైర్మన్ గా శశి థరూర్ ను తొలగించమని కోరుతూ స్పీకర్ కు పలు లేఖలు వ్రాసిన దూబే కమిటీ పరిధిలోకి పెగాసస్ వివాదం తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు.
అయితే ఇక్కడ సభలో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశంపై చర్చించడానికి సిద్దపడకుండా గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. అప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ ఆ నోటీసు అందినదని, దానిపై స్పీకర్ ఒక నిర్ణయం తీసుకొటారని చెప్పారు.
ఆ తర్వాత ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ఇస్తూ, అధికార పక్ష సభ్యులపై పత్రాలు చించి విసిరివేయడం ప్రారంభించారు. ఒక ఎంపీ విసిరివేసిన ప్లే కార్డు మీడియా బెంచీలపై పడింది. దానితో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నిరసన వ్యక్తం చేశారు. అగర్వాల్ వెంటనే సభను మరోసారి వాయిదా వేశారు.
చైర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించినందుకు రూల్ 374(2) ప్రకారం పది మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు ఆ తర్వాత స్పీకర్ తెలిపారు. ఒకవేళ ఎవరైనా సభ్యులు భవిష్యత్తులో ఇలాగే ప్రవర్తిస్తే, వారిని లోక్‌సభ టర్మ్ మొత్తం బహిష్కరించనున్నట్లు స్పీకర్ బిర్లా హెచ్చరించారు.
కాగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అధికార బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. కనీసం కాంగ్రెస్ పార్టీని కూడా నడపలేని రాహుల్ గాంధీ ఫోన్‌ను ఎవరెందుకు ట్యాప్ చేస్తారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎంత సేపటికీ తన ఫోన్ ట్యాప్ అయ్యిందని పాత్రికేయ సమావేశాలు నిర్వహిస్తూ రాహుల్ విమర్శలకు దిగుతున్నారు కానీ, ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా? అని నిలదీశారు.
కాంగ్రెస్‌ను సరిగ్గా నడపలేని రాహుల్ ఫోన్‌ను ట్యాప్ చేస్తే ఏమోస్తుందని సంబిత్ పాత్రా ఎద్దేవా చేవారు. రాహుల్ తన ఫోన్‌ను ఓ సారి చెక్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ అనేక సమావేశాలు నిర్వహిస్తే, కాంగ్రెస్ పార్టీ వాటిని బైకాట్ చేసిందని మండిపడ్డారు.
కోవిడ్‌పై చర్చిద్దామంటే తమకు పెగాసస్ వ్యవహారమే ముఖ్యమంటున్నారని, ప్రజల ప్రాణాలను కాంగ్రెస్ పార్టీ తేలిగ్గా తీసుకుంటూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. తమ తమ కుటుంబాలు బాగుంటే సరిపోతుందన్న ఏకైక లక్ష్యంతో ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయని, రాహుల్, ప్రియాంక రాజకీయంగా సుస్థిరత సాధించాలన్న లక్ష్యంతోనే కదులుతున్నారని విమర్శించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు