
రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. బకాయిలు చెల్లించేందుకు ఇదే చివరి అవకాశం అని తేల్చి చెప్పింది. చెల్లింపుల్లో జాప్యానికి కారణమైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
రూ.ఐదులక్షల లోపు విలువ చేసే పనుల్లో బిల్లులు చెల్లించేందుకు రూ. 870 కోట్లు విడుదలకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ జారీ చేశామని కోర్టుకు చెప్పి, ఇప్పటివరకు బకాయిలు చెల్లించకపోవడం ఏంటని మండిపడింది. పాత పనులకు బిల్లులు చెల్లించకుండా, కొత్తగా చేసిన పనులకు బిల్లులను ఎలా క్లియర్ చేస్తారని ప్రశ్నించింది. కేంద్రం నిధులు విడుదల చేసినా, చేయకపోయినా బిల్లులు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది.
ఈ నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని కోర్టుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ఆర్థిక, పంచాయితీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ కోర్టుకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. విచారణను ఆగస్టు నాలుగో తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది.
2019 జూన్1 లోపు నిర్వహించిన ఉపాధి హామీ పనులకు మెటీరియల్ కాంపోనెంట్ కింద ఖర్చు చేసిన సొమ్ము బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడాన్ని సవాల్‌చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రభుత్వం తరఫు ప్రత్యేక న్యాయవాది సి.సుమన్ వాదనలు వినిపిస్తూ .ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసిందని పేర్కొన్నారు.
‘‘జూలై నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం. విచారణను ఆగస్టు మొదటివారానికి వాయిదా వేయండి’’ అని కోరారు. పిటిషనర్ల తరఫు సీనియ ర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, వీరారెడ్డి, న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, ప్రణతి వాదనలు వినిపించారు.
‘‘గత ఏడాది జనవరిలో బిల్లుల చెల్లింపుకి ప్రభుత్వం హామీ ఇచ్చిం ది. అప్పటి నుంచి చెల్లింపు విషయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. గత ఏప్రిల్‌లో వ్యాజ్యాల విచారణ సందర్భంగా రూ. ఐదులక్షలలోపు విలువ చేసే పనుల్లో బిల్లులు చెల్లించేందుకు రూ.870 కోట్ల విడుదలకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ జారీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాదికోర్టు చెప్పారు. కానీ, ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు” అంటూ తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా 2019 జూన్ తరువాత బిల్లులు చెల్లిస్తున్నారని కోర్ట్ దృష్టికి తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉపాధి నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభు త్వం వేరే పథకాల కోసం మళ్లిస్తోంది. కేసు విచారణకు వచ్చిన ప్రతీసారి రాష్ట్ర ప్రభుత్వం కొత్త కారణాలు చూపుతూ విచారణను వాయిదా వేయిస్తున్నారని పేర్కొన్నారు.
More Stories
చంద్రబాబుకు అమరావతి రైతులు 10 రోజుల అల్టిమేటం!
భారతీ సిమెంట్స్ లీజుల రద్దుకు రంగం సిద్ధం
విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసులు