నూతన మంత్రులు తగు కసరత్తు చేసి పార్లమెంట్ కు రావాలి

ప్రతిపక్షాలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలున్నాయని, అందుకే నూతనంగా బాధ్యతలు చేసిన మంత్రులందరూ తగు కసరత్తు చేసిన తర్వాత పార్లమెంట్ కు  రావాలనిప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  స్పష్టం చేశారు. అలాగే పార్లమెంట్ నియమాలు, ఆయా పద్ధతుల విషయంలో క్షుణ్ణంగా అధ్యయనం కూడా చేయాలని బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సూచించారు.

ఈ నెల 19 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నదృష్ట్యా  సీనియర్ మంత్రులతో పాటు కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులకు ప్రధాని మోదీ దాదాపు 20 నిముషాల సేపు పలు సూచనలు చేశారు. సాధ్యమైనంత ఎక్కువ సేపు పార్లమెంట్‌లోనే ఉండాలని, సభలో జరిగే ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని మోదీ కేబినెట్ భేటీలో పేర్కొన్నారు.

‘‘ప్రజాస్వామ్యానికి దేవాలయం పార్లమెంట్. అందుకే నియమ, నిబంధనల విషయంలో జాగ్రత్తగా మసులుకోవాలి. అర్థవంతమైన చర్చలు జరపండి. రాజ్యసభలో జరిగే చర్చలపై మరింత దృష్టి నిలపండి. ఆ చర్చల నుంచి తగు విషయాలను నేర్చుకోండి’’ అని మోదీ నూతన మంత్రులకు సూచించారు.

సహాయ మంత్రులను కలుపుకుంటూ కేబినెట్ మంత్రులు పనిచేయాలని మోదీ కోరారు. శాఖా పరంగా ఏవైనా ఇబ్బందులు వస్తే మాత్రం వాటికి కేబినెట్ మంత్రే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని మోదీ తెగేసి చెప్పారు. విదేశీ పర్యటనల విషయంలో అధికారులు అనుమతులు తీసుకోవాలని, కచ్చితంగా, అవసరమైతేనే విదేశీ ప్రయాణాలకు అనుమతులు మంజూూరు చేయాలని కూడా మంత్రులకు సూచించారు.

మరోవైపు పార్లమెంటరీ శాఖ తరపున ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. సభ నియమాలు, నిబంధనలు, బిల్లులను ప్రవేశపెట్టే తీరు, వాటిని ఆమోదించే తీరు… ఇలా ప్రతి విషయాన్నీ నూతన మంత్రులకు వివరించారు.