తాలిబన్ల అండతో అఫ్గానిస్థాన్‌లో చైనా పాగా!

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సేనలు వెనుదిరుగుతున్నాయి. మరోవైపు.. అక్కడ తాలిబన్ల ప్రాబల్యం పెరుగుతోంది. దేశంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికే వారి వశమయ్యాయి. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటూ చైనా వేగంగా పావులు కదుపుతోందని అంతర్జాతీయ పరిశీలకులు గమనిస్తున్నారు.

ఇప్పటికే అఫ్గాన్‌లో పాగా వేసిన చైనా, తన ఆర్థిక ప్రయోజనాలను మరింతగా విస్తరించుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోందని అంటున్నారు. అఫ్గాన్ సహజ వనరులపై కన్నేయడంతో పాటూ చైనా తన షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని వీఘర్ ముస్లింలకు అఫ్గానిస్థాన్ నుంచి మద్దతు లభించకుండా పలు చర్యలు చేపడుతోంది.  

వాస్తవానికి కొన్నేళ్లుగా చైనా అఫ్గానిస్థాన్‌లో తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. 1990ల్లోనే తాలిబన్లకు పలు రకాలుగా సహాయసహకారాలు అందించింది. వీఘర్ ముస్లింల వేర్పాటు వాదానికి తాలిబన్ల మద్దుతు లభింకుండా పలు చర్యలు చేపట్టింది. 1996-2001 మధ్య తాలిబన్లకు ఆయుధాలు కూడా సరఫరా చేసింది. 

వీటితో తాలిబన్లు బ్రిటన్ సేనలను బలితీసుకోవడంతో..బ్రిటన్ ప్రభుత్వం ఈ విషయాన్ని చైనా దృష్టికి తీసుకెళ్లిందని అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ అప్పట్లో ప్రచురించింది కూడా. ఈ క్రమంలో గత 20 ఏళ్లుగా చైనా, తాలిబన్ల సంబంధాలు బలపడ్డాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. 

పలువురు తాలిబన్ కీలక నేతలు చైనాను పలు మార్లు సందర్శించి అక్కడి ప్రభుత్వానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారట. ప్రస్తుతం అఫ్గాన్‌లోని 85 శాతం భూభాగం తమ ఆధీనంలో ఉందని తాలిబన్లు చెబుతున్నారు. దేశ సరిహద్దుల వద్ద రాకపోకల్లో అధిక శాతం తమ కనుసన్నల్లో జరుగుతున్నాయని అంటున్నారు.

మరోవంక, చైనా నుండి పుననిర్మాణ పనులకోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు రాగలవని ఆశతో ఆ దేశం తమకు “స్నేహితుడు” అని తాలిబన్లు బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ భూభాగంలో 85 శాతం తమ ఆధీనంలో ఉన్నదని, చైనా పెట్టుబడులు, కార్మికులకు ఇక్కడ పూర్తి రక్షణ ఉంటుందని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ సహీన్  చైనా పత్రిక సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తో మాట్లాడుతూ భరోసా ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో..అఫ్గాన్‌ సరిహద్దుకు ఆవల ఉన్న చైనా షిన్‌జియాంగ్ ప్రావిన్స్ కీలకంగా మారింది. వీఘర్ ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇక చైనా నుంచి వేరుపడాలని ఎంతోకాలంగా తపిస్తున్న వీఘర్లకు ఒకప్పుడు అల్‌ఖైదా మద్దతు కూడా లభించింది. కొన్ని సందర్భాల్లో అల్‌ఖైదా మిలిటెంట్లు నేరుగా వీఘర్ దళాల్లో భాగమయ్యాయి.

అయితే…వారికి తాము ఎటువంటి మద్దతూ ఇవ్వబోమని తాలిబన్లు చైనాకు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారని సమాచారం. అంతేకాకుండా.. అల్‌ఖైదా, వీఘర్ వేర్పాటు వాదులను అఫ్గాన్ వేదికగా చైనా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించనీయమని అభయహస్తం ఇచ్చారట.

ఇక అఫ్గాన్ సహజవనరుల ద్వారా ఆర్థికప్రయోజనం పొందేందుకూ చైనాకు అవకాశమిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చారట. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం.. ప్రపంచస్థాయి నాణ్యత కలిగిన రాగి, ఇనుప ఖనిజం, చమురు, సహజవాయువు నిక్షేపాలకు అఫ్గాన్ నెలవు. ఈ నేపథ్యంలో తాలిబన్ల మద్దతుతో చైనా అక్కడ తన ఆర్థిక, భౌగోళిక ప్రయోజనాలకు మరింతగా విస్తరించుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోందనేది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు.