న్యాయవ్యవస్థపై నియంత్రణ తగదు

శాసన వ్యవస్థ లేదా కార్యనిర్వాహక వ్యవస్థ ప్రత్యక్షంగాగానీ పరోక్షంగాగానీ న్యాయవ్యవస్థను నియంత్రించరాదని, అలా చేస్తే చట్టబద్ధ పాలన మిథ్యగా మిగిలిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ హెచ్చరించారు. సోషల్‌ మీడియా పట్ల న్యాయమూర్తులు జాగ్రత్తగా ఉండాలని, వాటి ప్రభావానికి లోనుకాకూడదని హితవు చెప్పారు. 
 
జస్టిస్‌ పీడీ దేశాయ్‌ స్మారక సందేశంలో భాగంగా ప్రసంగీస్తూ కేసులపై నిర్ణయంలో మీడియా ట్రయల్స్‌ ప్రభావం పడకుండా చూసుకోవాలని న్యాయమూర్తులకు సూచించారు. ప్రజల భావోద్వేగాలకు, సోషల్‌ మీడియా ప్రచారాలకు ప్రభావితం కాకూడదని చెప్పారు. బయటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వతంత్రంగా వ్యవహరించడం కీలకమని తెలిపారు. 
 
చట్టం రెండువైపులా పదునున్న కత్తి లాంటిదని, న్యాయం అందించడమే కాదు, అన్యాయం జరగకుండా చూస్తుందని సూచించారు.  ‘రూల్‌ ఆఫ్‌ లా’పై మాట్లాడారు. అప్పట్లో బ్రిటిషర్లు, భారతీయులకు వేర్వేరు చట్టాలుండేవని చెప్పారు.  ‘రూల్‌ ఆఫ్‌ లా’ ఏర్పాటు కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 
 
కరోనా సంక్షోభంలో ప్రజల రక్షణ నిమిత్తం ‘రూల్‌ ఆఫ్‌ లా’ ఎంత మేరకు ఉపయోగిస్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలని చెప్పారు. కరోనా మహమ్మారి రాబోయే కాలానికి కర్టెన్‌ రైజర్‌గా భావిస్తున్నానని, ఎక్కడ తప్పు చేస్తున్నామో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ తీర్పులు ఆయన సంక్షేమ, మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తాయని జస్టిస్‌ ఎన్వీ రమణ కొనియాడారు. జస్టిస్‌ భూషణ్‌ తమకు విలువైన సహచరుడని, న్యాయ వ్యవస్థకు ఆయన అందించిన సేవలు చిరకాలం గుర్తుంటాయని చెప్పారు. 

జస్టిస్‌ భూషణ్‌ జూలై 4న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో నిర్వహించిన వీడ్కోలు సభలో  మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం గురించి జస్టిస్‌ భూషణ్‌కు ఉన్న తపన ఆయన అభిప్రాయాల్లో ప్రతిబింబిస్తుందని చెప్పారు.