ఎట్టకేలకు రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి!

సంవత్సరాల పాటు ఎదురు చుసిన అనంతరం ఎట్టకేలకు పార్లమెంట్ సభ్యుడు ఎ రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. వాస్తవానికి ఆయనను ఆ పదవిలో నియమించాలని రెండేళ్ల క్రితమే స్వయంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిర్ణయించినా, రాష్ట్రంలోని సీనియర్లు అడ్డు చెబుతూ  ఉండడంతో వాయిదా పడుతూ వచ్చింది.

ఆ దిశగా ఎప్పుడు హైకమాండ్ ఎప్పుడు ముందడుగు వేసినా అడ్డుపుల్లలు వేసేందుకు సీనియర్ నేతలు శతధా యత్నించిన సంగతి కొత్తేమీ కాదు. టిపిసిసి ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డిని నియమించడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం రేగింది. రేవంత్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత కిచ్చన్నగారి లకా్ష్మరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఒక పక్కన రేవంత్ వర్గం సంబురాలు చేసుకుంటే.. మరోవైపు అసంతృప్త నేతలు రాజీనామా బాట పడుతూ వున్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు కొత్తేమీ కాదు.

గత ఏడాది చివరిలో నియమించడంకు సిద్దపడగా నాగార్జున సాగర్ ఉపఎన్నిక ముగిసే వరకు ఆగమని మాజీ మంత్రి కె జానారెడ్డి కోరడంతో ఆగిపోయారు. ఆయన ఆ ఎన్నికలో ఓటమి చెంది, క్రియాశీల రాజకీయాలకే దూరమయ్యారు. ఈ లోగా తన నియామకం తేల్చని పక్షంలో తాను బీజేపీలో చేరడంతో, మరో ప్రాంతీయ పార్టీ పెట్టడమో చేస్తానని రేవంత్ రెడ్డి బెదిరిస్తూ వచ్చారు.

రేవంత్ నియామకం పట్ల పలువురు సీనియర్ నాయకులు బహిరంగంగానే అసమ్మతి తెలుపుతూ వస్తున్నారు. ఇప్పటికే అనేకమంది ముఖ్యమైన పార్టీ నాయకులు టి ఆర్  ఎస్, బిజెపి లలో చేరిపోయారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్ధకరంగా మారిపోతున్నది. అటువంటప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణాలో ఆ పార్టీకి ఏమాత్రం జీవం పోయగలరన్నది ప్రశ్నార్ధకరమే. 

ఇప్పటి వరకు పార్టీకి నేతృత్వం వహిస్తున్న వారిలో పలువురు కేసీఆర్ బి- టీం గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హుజారాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్న స్థబ్ధత ఇటువంటి ఆరోపణలకు బలం చేకూరుతుంది. ఈ మధ్య జరిగిన పలు ఉపఎన్నికలలో, మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ తన ఉనికి నిలబడలేక పోతున్నది. 

కాగా, రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని నియమించింది. అజారుద్దీన్‌, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్‌గౌడ్‌‌లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీని ఏఐసీసీ నియమించింది.

ప్రచారకమిటీ కన్వీనర్‌గా సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యాచరణ అమలు కమిటీ చైర్మన్‌గా మహేశ్వర్‌ రెడ్డి నియమితులయ్యారు. సీనియర్‌ ఉపాధ్యక్షులుగా సంభాని చంద్రశేఖర్‌, దామోదర్‌రెడ్డి, మల్లు రవి, పొదెం వీరయ్య, సురేష్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, రమేష్‌ ముదిరాజ్‌, గోపీశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌రావు, జావెద్‌ అమీర్‌‌లను ఏఐసీసీ ప్రకటించింది.

తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకోలేక, ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకోలేక వరుస వైఫల్యాలను చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించడంతో పాటు పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు, 2023లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు యువ నాయకత్వం అత్యవసరమని భావించి సీనియర్లు అనేకమందిని పక్కన పెట్టారు. అయితే బయటి నుంచి పార్టీలోకి వచ్చిన వ్యక్తికి, కేసులున్న వారికి టిపిసిసి పదవి ఎట్లా కట్టబెడతారని ఓ సీనియర్ నేత బాహాటంగానే ధ్వజమెత్తడం తెలిసిందే.