ప్రతీకార జ్వాలలతో రగిలిపోయిన ఆరవీడు గ్రామం 

జంటహత్యల నేపథ్యంలో అనంతపూర్ జిల్లా తాడిపత్రి సమీపంలోని యల్లనూరు మండలంలోని ఆరవీడులో ప్రతీకార దాడులు విధ్వంసానికి దారితీశాయి. మామా, అల్లుళ్లు రాజగోపాల్‌, నారాయణప్పను ఈనెల 19న హత్య చేయడానికి ప్రతీకారంగా మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు కలిసి, బందోబస్తు పోలీసుల సాక్షిగా శనివారం అర్ధరాత్రి నిందితుల ఇళ్లు, తోటలను టార్గెట్‌ చేస్తూ విధ్వంసాలు సృష్టించి, అగ్నికి ఆహుతి చేశారు. 

పచ్చని చీనీచెట్లు, అరటి చెట్లను కొట్టివేశారు. మరికొన్నింటికి నిప్పటించారు. డ్రిప్‌పైపులతోపాటు ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నిందితులకు చెందిన మొత్తం 9 ఇళ్లలో నాలుగు పూర్తిగా కాలిపోయాయి. మరోరెండు ఇళ్లలోని ఫర్నిచర్‌ ధ్వంసం కాగా.. మూడు ఇళ్ల కప్పుపైభాగం కూలిపోయింది. రోడ్లపై ఉన్న వరికుప్పలు సైతం అంటించేందుకు ప్రయత్నించారు. 

అయితే హత్యకు గురైనవారు, నిందితులు అందరు అధికార పార్టీకి చెందినవారీ కావడంతో వాస్తవాలను మరుగున పరచేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ గ్రామంలోకి మీడియా వారితో పాటు మరెవ్వరిని రానీయకుండా, అసలేమీ జరిగిందో బైటకు తెలియకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే డీఎస్పీ చైతన్య చెబుతున్న కధనాల పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బాధితులు ఆగ్రహావేశాలతో పెట్రోల్‌ తీసుకుని, న్యాయం చేయకుంటే నిప్పటించుకుంటామని బందోబస్తు పోలీసులను బెదిరించారని డీఎప్పీ చెబుతున్నారు. వారికి సర్దిచెప్పి పంపించే ప్రయత్నంలో కొంతమంది ఇళ్లపై దాడులు చేశారన్నారు. ఇందులో ఒక ఇల్లు మాత్రమే దెబ్బతిందనీ, పోలీసుల సమయస్ఫూర్తి వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసుల ప్రేక్షక పాత్రను సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఆరవీడులో దాదాపు 50 ఇళ్లున్నాయి. మూడు ప్రధాన వీధులున్నాయి. నిందితులకు సంబంధించి 9 ఇళ్లున్నాయి. జంటహత్యల అనంతరం ప్రతీకార దాడులు జరగకుండా అర్ధరాత్రి వరకు డీఎస్పీ చైతన్య, రూరల్‌ సీఐ మల్లికార్జున గుప్తాతోపాటు ఇద్దరు ఎస్‌ఐలు, 25 మంది కానిస్టేబుళ్లు బందోబస్తుగా ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత డీఎస్పీ, సీఐలు గ్రామం నుంచి రాగా మిగిలిన వారు బందోబస్తుగా ఉన్నారు.

బందోబస్తుగా ఇద్దరు ఎస్‌ఐలు, 25 మంది కానిస్టేబుళ్లు ఉన్నప్పటికీ ఎలా ప్రతీకార దాడులు జరిగాయో అర్థంకాని పరిస్థితి. నిందితులకు సంబంధించి 9 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఒక్కో ఇంటికి ఇద్దరు కానిస్టేబుళ్ల చొ ప్పున, 4 ఇళ్లకు ఒక ఎస్‌ఐ కాపలాగా ఉన్నా విధ్వంసాలు నియంత్రించలేక పో యారు.

జంట హత్యల అనంతరం నిందితులతోపాటు వారి కుటుంబాలు పరారు కావడంతో వారికి సంబంధించిన వరికుప్పలు భారీగా ఉన్నాయి. వంద బస్తాలకు పైగా వడ్లు రోడ్లపై ఆరబోశారు. మరికొన్నింటిని కుప్పలుగా వేశారు. వీటిని సైతం పెట్రోల్‌ పోసి, నిప్పంటించేందుకు బాధిత కుటుంబాలు ప్రయత్నం చేశాయి. కొన్నిచోట్ల కప్పిన టార్పాలిన్లు దెబ్బతిన్నాయి.

ఆరవీడు గ్రామంలో 20 ఏళ్ల కిందట వ్యక్తిగత కారణాల తో ఒక వ్యక్తిని హత్య చేశారు. అప్పటి నుంచి ఒక కేసు కూడా నమోదుకాలేదు. . ప్రస్తుతం జంటహత్యలు తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలకు పరోక్షంగా పోలీసు, రెవెన్యూ అధికారులే కారణమన్న అభిప్రాయాలు లేకపోలేదు. బీరప్పమాన్యంను ఆక్రమించిన నాగే్‌షపై పోలీసు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుని ఉండుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఏడాదిన్నరగా జరుగుతున్న మాన్యం వివాదంలో వారు చూపిన నిర్లక్ష్య వైఖరే నేటి విధ్వంసానికి హేతువన్న అభిప్రాయం వినిపిస్తోంది.