నేటి నుంచి తెలంగాణాలో `కేంద్రం’ బియ్యం పంపిణీ

నేటి నుంచి తెలంగాణాలో `కేంద్రం’ బియ్యం పంపిణీ

కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ప్రకటించిన ఉచిత బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూన్ ఒకటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక్కొ లబ్ధ్దిదారుడికి 15కిలోల వంతున బియ్యం పంపిణీ చేయనున్నారు. 

కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ప్రకటించిన బియ్యం మే నేలలోనే ఇవ్వాల్సిఉండగా స్పష్టమైన ఆదేశాలు రాకపోవటంతో రా ష్ట్రంలో పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టలేకపోయారు. దీంతో మేనెల కోటా కింద 5కిలోలతోపాటు జూన్ నెల కోటా కింద 5కిలోలు కలిపి మొత్తం పది కిలోలు ఒకేసారి అందచేయనున్నారు. 

అంతే కాకుండా వీటితో పాటు రాష్ట్రప్రభుత్వం నుంచి కూడా జూన్‌నెల కోటా కింద 5కిలోల బియ్యం అందనున్నాయి. దీంతో అటు కేంద్రం ఇచ్చే 10 కిలోలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోలు కలిపి 15 కిలోల బియ్యాన్ని లబ్దిదారులకు ఒకసారి అందచేయనున్నట్టు అధికారులు వివరించారు.

అంత్యోదయ పథకం పరిధిలోని కార్డుదారులకు 35 కిలోల బియ్యంతో పాటు అదనంగా ఒక్కొక్కరికీ 10 కిలోల బియ్యం అందనంగా పంపిణీ చేయనున్నారు. అన్న పూర్ణ పథకం కింద ఉన్న కార్డు దారులకు పది కిలోల బియ్యం పాటు అదనంగా మరో పది కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 53.56 లక్షల కార్డులు పాటుగా, రాష్ట్ర ప్రభుత్వం 33.86 లక్షల కార్డుదారులకు ఎలాంటి పరిమితి లేకుండా 15 కిలోల బియ్యం ఉచితంగా అందించనున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 2,79,24,300 మందికి లబ్దిదారులకు ప్రయోజనం కలుగనుంది. 

మేనెల ఉచిత బియ్యింతో కలిపి జూన్‌లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్య ం పంపిణీ చేయనున్నారు. కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్‌తో లాక్‌డౌన్‌లో ఉపాధి పనులు లేక బిక్కుబిక్కు మంటు కాలం గడుపుతున్న నిరుపేద వర్గాలకు పెద్ద ఊరట కలగనుంది.