టీకా వృథా త‌గ్గేలా చేస్తున్న కేర‌ళ‌కు ప్ర‌ధాని ప్ర‌శంస‌లు

కొవిడ్ వ్యాక్సీన్లను సమర్థంగా వినియోగిస్తూ, వృధాను అరికడుతున్న కేరళ నర్సులు, వైద్య సిబ్బందిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. దేశవ్యాప్తంగా మూడోదశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యాక్సీన్లకు కొరత రాకుండా ఉత్పత్తిని మరింత వేగవంతం చేశారు. 

ఈ నేపథ్యంలో  ప్రధాని మోదీ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘కొవిడ్-19పై పోరాటాన్ని బలోపేతం చేసేందుకు వ్యాక్సీన్ వృధాను అరికట్టడం చాలా ముఖ్యం..’’ అని పేర్కొన్నారు. ‘వ్యాక్సిన్ల వ్యర్థాన్ని తగ్గించడంలో మన ముందు ఉదాహరణగా నిలిచిన కేర‌ళ ఆరోగ్య కార్యకర్తలు, నర్సుల కృషిని చూస్తే చాలా ఆనందంగా ఉన్న‌దని, కొవిడ్‌-19 కు వ్యతిరేకంగా జ‌రుపుతున్న పోరాటానికి ఇది అవ‌స‌రం’ అని కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌రాయి విజ‌య‌న్‌ను మోదీ కొనియాడారు.

తన సందేశంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోస్టును ప్రధాని రీట్వీట్ చేశారు.  ఇప్పటి వరకు కేంద్రం నుంచి కేరళకు 73,38,806 వ్యాక్సీన్ డోసులు అందాయని విజయన్ పేర్కొన్నారు. 

‘‘ మాకు మొత్తం 74,26,164 డోసులు అందాయి. ప్రతి వెయిల్‌లోనూ వృధా కింద ఒక డోసు అదనంగా ఉంటుందనీ.. దాన్ని కూడా ఉపయోగించి తమ హెల్త్ వర్కర్లు, ప్రత్యేకించి నర్సులు అత్యంత సమర్థంగా పనిచేస్తున్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు..’’ అని విజయన్ పేర్కొన్నారు.

వ్యాక్సిన్ నిల్వలు వేగంగా క్షీణిస్తుండడంతో కేంద్రం ఇప్పుడు వ్యాక్సిన్ వృధాపై దృష్టిపెట్టింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం బుధవారం  ఉదయం 8 గంటల వరకు మేఘాలయ, నాగాలాండ్, బీహార్, పంజాబ్, దాద్రా – నగర్ హవేలీ, హర్యానా, మణిపూర్, అసోం, తమిళనాడు, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో వృధా శాతం 4.01 నుంచి 9.76 శాతం వరకు ఉంది. 

కేరళలో మాత్రం వ్యాక్సీన్ వృధా శాతం అత్యంత తక్కువగా ఉంది. కాగా ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో సైతం ప్రధాని మోదీ వ్యాక్సిన్ వృధాపై ప్రత్యేక సూచనలు చేశారు. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే వినియోగించడం వల్ల వృధాను అరికట్టవచ్చని ప్రధాని సూచించారు. 

వయల్ తెరిచిన తర్వాత డోసులకు సరిపడా లబ్దిదారులు లేకపోతే.. అవి వ్యాకోచించి వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాగా రాష్ట్రాల వారీగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల వివరాలను కేంద్రం ఇవాళ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద మొత్తం 94.47 లక్షల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. వచ్చే మూడు రోజుల్లో మరో 36 లక్షల డోసులు రాష్ట్రాలకు చేరనున్నాయని కేంద్రం తెలిపింది.