కేరళ సీఎం విజయన్‌కు కరోనా పాజిటివ్

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. మార్చి మూడో తేదీన సీఎం విజయన్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు వేయించుకున్నారు. అయినప్పటికీ తాజాగా నిర్వహించిన టెస్టుల్లో కరోనా సోకినట్లు వచ్చింది.

‘ప్రస్తుతం ముఖ్యమంత్రికి లక్షణాలు లేవు. కానీ, కోజికోడ్‌ మెడికల్‌ కళాశాలకు తరలించే అవకాశం ఉందని’ సీఎంవో అధికారులు తెలిపారు. గతంలో విజయన్‌ కూతురు వీణా విజయన్‌, అల్లుడు పీఏ మొహమ్మద్‌ రియాజ్‌లు కరోనా బారినపడ్డారు. 

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయన్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఒకే దశలో ఏప్రిల్‌ 6న అన్ని స్థానాలకు పోలింగ్‌ జరగ్గా..మే రెండో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

‘నాకు కొవిడ్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. కోజికోడ్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతాను. గత కొద్దిరోజులుగా నాతో కాంటాక్ట్‌ అయిన వారు వెంటనే టెస్టులు చేయించుకోవాలని, సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్లాలని’ ముఖ్యమంత్రి ట్విటర్లో అభ్యర్థించారు.