తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో నేడు ఒకే రోజు పోలింగ్

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో నేడు ఒకే రోజు పోలింగ్

నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మంగళవారం జరిగే పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. అధికార ఎఐఎడిఎంకె, ప్రధాన ప్రతిపక్షం డిఎంకె నేతృత్వంలోని కూటముల మధ్యే ప్రధాన పోటీ ఉండనున్నది. ఎఐఎడిఎంకె నేతృత్వంలోని కూటమిలో బిజెపి, పిఎంకె భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. 

డిఎంకె కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 130 స్థానాల్లో ఎఐఎడిఎంకె, డిఎంకె ముఖాముఖి తలపడనున్నాయి. బిజెపి కేవలం 20 సీట్లలోనే పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌కు 25 సీట్లు మాత్రమే డిఎంకె కేటాయించింది. ముఖ్యమంత్రి కె.పళనిస్వామి ఎడప్పాడి స్థానం నుంచి పోటీ చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా డిఎంకె అభ్యర్థి టి.సంపత్‌కుమార్ బరిలో నిలిచారు. ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం బోడినాయక్కనూర్ నుంచి పోటీ చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా డిఎంకె అభ్యర్థి తంగ తమిళసెల్వన్ ఉన్నారు. 

డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ కోలాతూర్ నుంచి పోటీ చేశారు. ఎఐఎడిఎంకె అభ్యర్థి ఆదిరాజారామ్‌ను ఆయన ఎదుర్కోనున్నారు. ఎంఎన్‌ఎం అధినేత కమల్‌హాసన్ కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మొత్తం 234 స్థానాల్లో 3,998మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కేరళలోని 140 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ రాష్ట్రంలో ప్రధాన పోటీ అధికార సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ మధ్యనే ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ రాష్ట్రంలోని 140 స్థానాలకు 957మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఐదేళ్లకోసారి అధికారం చేతులు మారుతుందన్న ఆనవాయితీ ఉన్నది. 

అయితే, ఈసారి అది బ్రేకై తిరిగి ఎల్‌డిఎఫే అధికారం చేపట్టనున్నట్టు ఎన్నికల సర్వేల్లో వెల్లడైంది. బరిలో ఉన్న ప్రముఖుల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్(సిపిఐ(ఎం), రమేశ్ చెన్నితాల, ఊమెన్‌చాందీ (కాంగ్రెస్) ఉన్నారు. మరోవైపు బిజెపి తరఫున మెట్రోమ్యాన్ ఇ. శ్రీధరన్‌ను ఎన్నికల బరిలోకి దించారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని 30 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని సెక్యులర్ ఫ్రంట్, ఎఐఎన్‌ఆర్‌సి నేతృత్వంలోని ఎన్‌డిఎ మధ్యే ప్రధాన పోటీ ఉండనున్నది. మొత్తం 324మంది అభ్యర్థులు పుదుచ్చేరి అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. బెంగాల్, అసోంల్లో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయింది. మూడో దశలో మంగళవారం బెంగాల్‌లోని 31 స్థానాలకు పోలింగ్ జరగనున్నది. 

205మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అసోంలోని 40 స్థానాలకు పోలింగ్ జరగనున్నది. ఈ స్థానాలకు 337మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మూడోదశ పోలింగ్‌తో అసోంలో ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది. బెంగాల్‌లో మాత్రం మరో ఐదు దశల్లో పోలింగ్ జరగనున్నది. తమిళనాడు నుంచి ఎఐఎడిఎంకె నేతలు పళనిస్వామి, పన్నీర్‌సెల్వం, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్, ఎంఎన్‌ఎం అధినేత కమల్‌హాసన్… కేరళ నుంచి సిపిఐ(ఎం) నేత పినరయి విజయన్, కాంగ్రెస్ నేతలు రమేశ్ చెన్నితాల, ఊమెన్‌చాందీ, బిజెపి తరఫున మెట్రోమ్యాన్ ఇ. శ్రీధరన్.