బెంగాలీలను అవమానిస్తే సహించను 

బెంగాలీలను అవమానిస్తే సహించను 
బెంగాలీలు చాలా ఆత్మాభిమానం కలవారని పేర్కొంటూ సీఎం మమతా బెనర్జీ తనను అవమానించినా పర్లేదు కానీ, బెంగాలీలను అవమానిస్తే సహించమని ప్రధాని నరేంద్ర మోదీ  హెచ్చరించారు. బెంగాల్ ప్రజలను ఎవరూ కొనలేరని, వారిలో స్వాభిమానం మెండుగా ఉంటుందని స్పష్టం చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తారకేశ్వర్‌లో పర్యటిస్తూ బీజేపీ వాళ్లు ప్రజలకు ఎక్కువగా డబ్బులు పంచుతున్నారు కాబట్టే, వారి సభలకు ప్రజలు వెళ్తున్నారని సీఎం మమత పేర్కొనడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మే 2 న రావాల్సిన ఫలితాలు రెండు రోజుల క్రితమే నందిగ్రామ్‌లో కనిపించాయని, ఓటమి కారణంగా దీదీ భయపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఓడిపోవడం మమత కళ్లముందే కనిపిస్తోందని, దానిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని మోదీ హితవు చెప్పారు. పదేళ్ల క్రితం ఇదే బెంగాలీలు సీఎం మమతను నెత్తికెత్తుకున్నారని, అంతటి ప్రజలను దీదీ అవమానపరుస్తున్నారని మోదీ ఆక్షేపించారు. తృణమూల్ ప్రభుత్వమే బెంగాల్‌కు అతిపెద్ద ముప్పు అని, గత పదేళ్ల పాలన దీనిని రుజువు చేసిందని మోదీ ఎద్దేవా చేశారు.

ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయడానికి చేతులు ముందుకు వస్తాయని, కానీ తృణమూల్ మాత్రం డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. గత పదేళ్లలో సీఎం మమత ప్రోగ్రెస్ కార్డ్ సున్నా, అని పదేళ్లలో మమత చేసిందేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు.

పాత పరిశ్రమలు మూతపడ్డాయని, కొత్త పరిశ్రమల స్థాపన జరగడం లేదని, నిరుద్యోగులు ఎక్కువయ్యారని మోదీ తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ‘కిసాన్ సమ్మాన్ నిధి యోజన’ ను అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. బీజేపీ విజయం సాధించిన తర్వాత జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవానికి కచ్చితంగా హాజరవుతానని మోదీ ప్రకటించారు.