
బీబీసీ వరల్డ్ న్యూస్ ప్రసారాలను చైనా ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు గురువారం చైనా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
చైనా గురించి బీబీసీ ప్రసారం చేస్తున్న వార్తలు మీడియా నియమ, నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని చైనా పేర్కొంది. వీగర్ ముస్లింలు, కరోనావైరస్ విషయంలో బీబీసీ ప్రసారం చేస్తున్న వార్తలను చైనా ప్రభుత్వం తప్పుబట్టింది.
ఈ క్రమంలోనే చైనా స్టేట్ ఫిల్మ్, టీవీ అండ్ రేడియో అడ్మినిస్ర్టేషన్ బీబీసీపై నిషేధం విధించింది. చైనాకు చెందిన చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్ వర్క్(సీజీటీఎన్) ప్రసారాలను బ్రిటీష్ మీడియా రెగ్యులేటరీ సంస్థ ఆఫ్కామ్ ఇటీవలే నిలిపివేసిన విషయం తెలిసిందే.
సీజీటీఎన్ మీడియా నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు పొందిందని గుర్తించింది బ్రిటీష్ మీడియా రెగ్యులేటరీ సంస్థ. చైనా నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురైనట్లు బీబీసీ యాజమాన్యం పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బీబీసీ.. ఎలాంటి పక్షపాతం లేకుండా వార్తలను ప్రసారం చేస్తుందని యాజమాన్యం స్పష్టం చేసింది.
చైనాలో బీబీసీ నిషేధంపై అమెరికా కూడా స్పందించింది. దీన్ని తీవ్రంగా ఖండించిన అమెరికా హోంశాఖ.. చైనాలో మీడియా అణిచివేతకు గురవుతోందని ఆరోపించింది.
More Stories
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా
బలూచ్ ఆర్మీని ఉగ్రసంస్థగా ప్రకటించే అభ్యర్థనకు అమెరికా వీటో
పాక్- సౌదీ రక్షణ ఒప్పందంపై భారత్ అధ్యయనం