
భారత్-చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు చర్చల ద్వారా తగ్గుతాయనే ఆశాభావాన్ని ఐక్య రాజ్య సమితి (ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వ్యక్తం చేశారు. సెక్రటరీ జనరల్‌కు అధికార ప్రతినిధి స్టెఫానే డెజరిక్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సరిహద్దుల వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు చర్చల ద్వారా పరిష్కారం కాగలవని ఆశిస్తున్నట్లు తెలిపారు.
భారత్-చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యాలు తాజాగా ఘర్షణపడిన నేపథ్యంలో ఐరాస సెక్రటేరియట్ కానీ, సెక్రటరీ జనరల్ కానీ ఏమైనా స్పందిస్తారా? అని అడిగినపుడు స్టెఫానే మాట్లాడుతూ, ‘‘సరిహద్దుల వెంబడి ఉండే అవకాశం ఉన్న ఉద్రిక్తతలు చర్చల ద్వారా తగ్గగలవని మేం ఆశిస్తున్నామని మాత్రమే చెప్పగలం’’ అని తెలిపారు.
భారత్-చైనా మధ్య తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి గత ఏడాది మే నెల నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గత ఏడాది జూన్‌లో చైనా సైనికులు ఘర్షణకు దిగడంతో మన దేశ సైనికులు 20 మంది అమరులయ్యారు. గాల్వన్ లోయలో జరిగిన ఈ ఘర్షణలో చైనా సైనికులను తరిమికొట్టి, అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహా వీర చక్ర పురస్కారాన్ని ప్రకటించింది.
తాజాగా జనవరి 20న చైనా దళాలు ఉత్తర సిక్కింలోని నకు లా ప్రాంతంలో భారత సైన్యంతో ఘర్షణకు దిగాయి. ఈ సంఘటనలో నలుగురు భారత సైనికులు గాయపడినట్లు, దాదాపు 15 మంది చైనా సైనికులు గాయపడినట్లు సమాచారం. దీనిపై భారత సైన్యం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో స్వల్ప ఘర్షణ జరిగిందని పేర్కొంది. ఈ ఘర్షణను లోకల్ కమాండర్స్ సువ్యవస్థీకృత నిబంధనల ప్రకారం పరిష్కరించినట్లు తెలిపింది.
More Stories
పాక్ ను మట్టికరిపించిన భారత మహిళల జట్టు
భారీ వర్షాలకు నేపాల్ లో 51 మంది, డార్జిలింగ్ లో 23 మంది మృతి
ఖలిస్థాన్ ఉగ్రవాదులకు నిధులపై కెనడా నిఘా