హిందూ మతానికి చెందినవారు ఎవరైనా.. వాళ్లంతా దేశభక్తులే అని రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు.  దేశభక్తి గురించి మహాత్మా గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఊటంకిస్తూ తన ధర్మం నుంచే దేశభక్తి ఉద్భవిస్తుందని గాంధీ అన్నారని గుర్తు చేశారు.
మేకింగ్ ఆఫ్ ఏ హిందూ పేట్రియాట్- బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ గాంధీజీస్ హింద్ స్వరాజ్’ పేరిట ముద్రితమైన పుస్తకాన్ని భగవత్ ఆవిష్కరిస్తూ గాంధీజీని అనుకరించేందుకు సంఘ్ చూస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. గాంధీజీ లాంటి గొప్ప వ్యక్తుల్ని మరొకరు అనుకరించలేరని  చెప్పారు.  
ఈ పుస్తకాన్ని జేకే బజాజ్, ఎండీ శ్రీనివాస్ రాశారు. గాంధీపై రాసిన పరిశోధనాత్మక గ్రంధం ఈ పుస్తకం అని చెబుతూ  తనకు మాత్రం ధర్మం, దేశభక్తి ఒకటే అని, ఆధ్యాత్మికత నుంచే మాతృభూమి పట్ల ప్రేమ పుడుతుందని పేర్కొన్నారు. తన ధర్మం నుంచే దేశభక్తి వస్తుందని గాంధీజీ అన్నారని, ధర్మం అంటే కేవలం మతం మాత్రమే కాదు అని, అది అంతకన్నా విశాలమైందని తెలిపారు.
గాంధీజీ ఒకసారి… తన దేశభక్తి తాను అనుసరిస్తున్న ధర్మం నుంచి వచ్చిందని చెప్పారని చెబుతూ  హిందుత్వం మూలాలు దేశభక్తిలో ఉన్నాయని, దీనిలో దేశద్రోహ భావనకు అవకాశం లేదని స్పష్టం చేశారు. స్వధర్మాన్ని అవగాహన చేసుకోనంత కాలం స్వరాజ్యమనేదేమిటో అర్థం కాదని భగవత్ హితవు చెప్పారు. 
గాంధీ తన ధర్మం సర్వ ధర్మాలకు ధర్మమన్నారని తెలుపుతూ తాను ధర్మాన్ని అర్థం చేసుకునే దేశభక్తుడను అయ్యానని గాంధీజీ తెలిపారని గుర్తు చేశారు. ప్రజలంతా దీనిని అర్థం చేసుకోవాలని మోహన్ భగవత్ కోరారు.  
 హిందూ మతానికి చెందినవారెవరైనా, వారు దేశభక్తులై ఉంటారని, అదే వారి సహజమైన ప్రవర్తన, స్వభావం  అని పేర్కొన్నారు.  ఎవరైనా దేశాన్ని ప్రేమిస్తున్నామంటే, అది కేవలం ప్రజలను మాత్రమే కాదు,  అక్కడి భూమిని, ప్రజలను, నదులను, సంస్కృతిని, సాంప్రదాయాలను, అన్నింటినీ ఇష్టపడుతున్నట్లు భగవత్ తెలిపారు.
హిందూ మతం ఐకమత్యాన్ని నమ్ముతుందని చెబుతూ విభేదించడం అంటే వేరుపడడం కాదు అని, అన్ని మతాలకు హిందూ మతమే మూలమని గాంధీజీ పేర్కొన్నట్లు భగవత్ వెల్లడించారు.   ఏకత్వంలో అనేకత్వం, అనేకత్వంలో ఏకత్వం భారతీయ విశిష్ట లక్షణమని పేర్కొంటూ  ఇక్కడి పూజా విధానాలు, కర్మకాండలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఇక్కడ అందరూ కలసి జీవిస్తున్నారన్నారని వివరించారు. భిన్నత్వం అంటే ఈ సమాజం నుంచి విడివడటం కాదని స్పష్టం చేశారు. 
                            
                        
	                    
More Stories
సుప్రీంకోర్టులో ట్రంప్ టారీప్లపై భారత సంతతి లాయర్ సవాల్
74 శాతం భారతీయ విద్యార్థులను తిరస్కరించిన కెనడా
7న సామూహికంగా వందేమాతరం ఆలాపన