ఎంబీబీఎస్  అడ్మిషన్ల ప్రక్రియలో గందరగోళం  

ఎంబీబీఎస్  అడ్మిషన్ల ప్రక్రియలో గందరగోళం  

ఎంబీబీఎస్  అడ్మిషన్ల ప్రక్రియలో తెలంగాణలో  గందరగోళం చెలరేగింది. అడ్మిషన్ల కోసం కాళోజీ హెల్త్ వర్సిటీ అవలంబిస్తున్న విధానంతో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతోందని, ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు ఎక్కువ సీట్లు వెళ్లాయన్న ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ విద్యార్థులు సుమారు 40 ఎంబీబీఎస్​ సీట్లు కోల్పోయారని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

స్థానికంగా గల ​ మెరిట్​ విద్యార్థులను కాదని, తక్కువ ర్యాంకు వచ్చిన ఏపీ వారికి సీట్లు ఇస్తూ ఉండడంతో ఆందోళన వ్యక్తం అవుతున్నది. విభజన చట్టం ప్రకారం  తెలంగాణ, ఏపీల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 15 శాతం సీట్లను ఇరు రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం కల్పించే విధంగా ఓపెన్  కేటగిరీలో భర్తీ చేయాలి.

మెరిట్  ర్యాంకు ఎవరికి ఉంటే, వారికే సీటు ఇస్తారు. ఇది కాకుండా లోకల్​ ఓపెన్ ​(లోకల్​ అన్​రిజర్వుడ్) కోటా సీట్లు ఉంటాయి. వీటిని కేవలం ఆయా రాష్ట్రాల విద్యార్ధులతోనే  మెరిట్​ను బట్టి భర్తీ చేస్తారు. ఇక్కడివరకు ఏపీ, తెలంగాణలో ఒకే విధంగా కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతోంది. అయితే రెండో దశ ‌‌ సీట్ల కేటాయింపు మాత్రం ఏపీలో ఓ రకంగా, తెలంగాణలో మరో రకంగా నిర్వహిస్తున్నారు. మొదటి   కౌన్సెలింగ్‌‌లో ఓపెన్​ కేటగిరీ సీట్లు పొందిన కొందరు విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరాక పోవడంతో ఆ సీట్లు మిగిలిపోతున్నాయి.

ఏపీలో ఇలా సీట్లు మిగిలిపోతే నేరుగా మెరిట్​లిస్టులో తర్వాతి స్థానంలో  ఉన్న విద్యార్థులకు ఇస్తున్నారు. దీనివల్ల ఓపెన్​ కేటగిరీలో ఏపీ వాళ్లకే ఎక్కువ సీట్లు దక్కుతున్నాయి. మొదట ఏపీలోనూ రెండవ దశలోనూ దరఖాస్తు చేసుకున్నవారికే సీట్లు ఇచ్చారు. దానితో తెలంగాణ విద్యార్థులకు  సీట్లు వస్తున్నాయన్న ఉద్దేశంతో అడ్మిషన్ల నిబంధనలను ​మార్చారు. మిగిలిన ఓపెన్​ సీట్లను మెరిట్‌‌ లిస్ట్‌‌లో తర్వాత ఉన్నవారికే ఇచ్చేలా జీవో ఇచ్చారు. తెలంగాణలో ఈ మార్పు చెయ్యకుండా పాత పద్ధతి ప్రకారమే కాళోజీ వర్సిటీ  కౌన్సెలింగ్‌‌  చేపట్టింది.

తెలంగాణలో సుమారు 450 ఓపెన్​ కేటగిరీ సీట్లు ఉండగా అందులో 220 ఏపీ వాళ్లకు, 230 తెలంగాణ వాళ్లకు వచ్చినట్టు వర్సిటీ అధికారులు చెప్తున్నారు. అదే ఏపీ తరహాలో కౌన్సెలింగ్ నిర్వహిస్తే తెలంగాణ వాళ్లకు 270 సీట్లు, ఏపీ వాళ్లకు 180 సీట్లు వచ్చి ఉండేవి.

తెలంగాణలో మొదటి దశ‌లో సీట్లు మిగిలితే నేరుగా మొత్తం మీద ​ లిస్టులోని వాళ్లకు ఇవ్వకుండా, రెండవ దశ​లో ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకే కేటాయిస్తున్నారు. అయితే మొదటి ​ రౌండ్​లో ఓపెన్​ కేటగిరీ కటాఫ్​ కంటే కాస్త తక్కువ ర్యాంకు వచ్చి స్థానిక  కేటగిరీలో సీటు తీసుకున్న తెలంగాణ విద్యార్థులు రెండో దశలో  ఓపెన్​ కేటగిరీకి దరఖాస్తు  చేసుకోవడం లేదు.

 దీంతో దరఖాస్తు చేసుకున్న ఏపీ విద్యార్థులకు  సీట్లు వెళ్లిపోతున్నాయి. ఇలాంటప్పుడు.. లోకల్​ కేటగిరీలో సీటు తీసుకున్న తెలంగాణ మెరిట్​ విద్యార్థులను  ఓపెన్​ కేటగిరీ ఖాళీలోకి మార్చితే వారి లోకల్​ కేటగిరీ సీటు ఖాళీ అయి, దానిలో తెలంగాణ విద్యార్థులకే అవకాశం వచ్చే వీలున్నట్లు నిపుణులు  చెప్తున్నారు.