రాజకీయ దిగ్గజం రాయపాటి సాంబశివరావు కన్నుమూశారు. 83 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో బాధపడుతూ గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. రాయపాటి రాజకీయ ప్రస్థానం 1972 నుంచి మొదలైంది. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.
1943 జూన్ 7న పల్నాడు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరులో ఆయన జన్మించారు. హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తిచేశారు. 1982 నుంచి 1988 మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 39 ఏళ్ల వయసులోనే రాజ్యసభకు ఎన్నికై యువ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కోశాధికారి, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
1996లో మొదటిసారి గుంటూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత నాలుగు పర్యాయాలు గుంటూరు నుండి, ఒక సారి నరసరావుపేట నుండి లోక్‌సభకుఎన్నికయ్యారు. 2014లో టీడీపీలో చేరి నరసరావుపేట నుండి ఎంపీగా విజయం సాధించారు. 2019లో ఓటమి చెందారు. రాజకీయాల్లోనే కాదు పలు విద్యాసంస్థల అభివృద్ధికి కూడా రాయపాటి కృషి చేశారు.
నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ, ఆర్‌వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కాలేజీ సహా వివిధ విద్యా సంస్థల అభివృద్ధిలో రాయపాటి కీలక పాత్ర పోషించారు. రాయపాటి కుటుంబానికి పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో కూడా గుర్తింపు ఉంది. కాగా 2016లో ఆయన భార్య రాయపాటి లీలాకుమారి గుండెపోటుతో చనిపోయారు. రాయపాటి దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
గతంలో ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స పొంది కోలుకున్నారు. అయితే ఇటీవల ఆ వ్యాధి తిరగబెట్టడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు నవంబర్ 23వ తేదీన ఆయన్ను గుంటూరు రమేశ్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల బృందం ఎంతగా శ్రమించినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కన్నుమూశారు.
ఆయన పొగాకు బోర్డు వైస్ చైర్మన్, టిటిడి బోర్డు సభ్యునిగా పలు ప్రతిష్టాకర సంస్థలలో పనిచేశారు. ఆయన సోదరుడు డా. రాయపాటి శ్రీనివాస్ గతంలో గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్యెల్సీగా ఎన్నికయ్యారు. రాయపాటి సాంబశివరావు సోదరుడి కుమార్తె అయిన రాయపాటి శైలజ ప్రస్తుతం ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ గా కూడా ఉన్నారు.
సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గారి మృతి తనను తీవ్రంగా కలచివేసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఆరుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు సేవలందించిన ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్న ట్లు తెలిపారు. సుదీర్ఘ ప్రజాసేవతో గుంటూరు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాయపాటి గారికి నివాళి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని సీఎం తెలిపారు.

More Stories
భారత ఆత్మ అంతర్గతంగా మేల్కొంటుంది
1984 అల్లర్ల సమయంలో సిక్కులను సంఘ్ కార్యకర్తలు కాపాడారు
మాదకద్రవ్యాల వినియోగం, దుర్వినియోగం ఓ ప్రధాన సవాల్