మాదకద్రవ్యాల వినియోగం, దుర్వినియోగం ఓ ప్రధాన సవాల్

మాదకద్రవ్యాల వినియోగం, దుర్వినియోగం దేశ యువత కలలకు ఒక పెద్ద సవాలుగా మారాయని  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సమస్యపై పోరాటంలో సమాజం మరింత చురుకుగా పాల్గొంటున్న విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమం 140వ ఎపిసోడ్‌లో ఆదివారం  ప్రసంగిస్తూ, దేశవ్యాప్తంగా ‘నశా ముక్త్ యువ అభియాన్’ (మాదకద్రవ్య రహిత యువత ఉద్యమం) కొనసాగుతోందని ఆయన తెలిపారు.
 
అంతకుముందు, ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ‘నశా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్’ను ప్రారంభించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ దేశవ్యాప్త ఉద్యమం వ్యక్తులకు, కుటుంబాలకు, సమాజానికి, దేశానికి మేలు చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. 
 
“నేడు మనం చూస్తున్న ఈ ఉద్యమం వ్యక్తుల కోసం, కుటుంబాల కోసం, సమాజం కోసం; అన్నింటికంటే ముఖ్యంగా దేశం కోసం ఉద్దేశించింది. ‘వికసిత్ భారత్ సంకల్ప అభియాన్’లో భాగంగా చేపట్టిన ‘నశా ముక్త్ యువ’ (మాదకద్రవ్య రహిత యువత) అనే ఈ పేరులోనే దీని లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది” అని ప్రధాని మోదీ తెలిపారు. 
 
“దేశం ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతం) లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో, మన యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం, ఆత్మవిశ్వాసంతో నిండి ఉండటం, మాదకద్రవ్యాల వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండటం చాలా అవసరం. ఇదే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశ్యం” అని చెప్పారు. సామాజిక ఉద్యమాలలో సామూహిక భాగస్వామ్యం ఎంత శక్తివంతమైనదో కూడా ప్రధాని మోదీ వివరించారు. 
 
ప్రభుత్వ ఉద్యోగుల కోసం 17 భారతీయ భాషల్లో 7,000కు పైగా కోర్సులను అందించే ‘ఐగాట్ కర్మయోగి’ ప్లాట్‌ఫామ్ గురించి మోదీ మాట్లాడారు. లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్లాట్‌ఫామ్‌ వేదికగా అనేక కోర్సులను పూర్తి చేశారని తెలిపారు. కొందరు ఏఐపై పట్టు సాధిస్తుండగా, మరికొందరు భారతీయ సైగ‌ల‌ భాషను నేర్చుకుంటున్నారని తెలిపారు.                                         
‘సంచార్ సాథీ’ యాప్ గురించి ప్రస్తావిస్తూ పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్‌లను గుర్తించడంలో, మోసపూరిత కాల్స్‌ను రిపోర్ట్ చేయడంలో, డిజిటల్ ప్రపంచాన్ని మరింత సురక్షితంగా మార్చడంలో ఇది సాయపడుతోందని చెప్పారు. ప్రపంచంలోని 100 బెస్ట్‌ మ్యూజియమ్స్‌ జాబితాలో పట్నాలోని బీహార్ మ్యూజియం తొమ్మిదో స్థానంలో నిలవడంపై ప్రధాని హర్షం వ్యక్తంచేశారు.

ఈ మ్యూజియం ఆసియాలోనే మొదటి స్థానంలో నిలిచిందని ప్ర‌ధాని చెప్పారు. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో ఉన్న ‘వాద్‌నగర్ ఆర్కియాలాజికల్ ఎక్స్‌పీరియెన్షియల్ మ్యూజియం’ గురించి ఆయ‌న‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్థానికంగా పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో అనేక వస్తువులు బయటపడ్డాయని, ఆ తవ్వకాలు జరిగిన ప్రదేశంలోనే ఈ మ్యూజియాన్ని నిర్మించారని చెప్పారు.

 

About The Author