ఇరాన్‌ షరతులు నెరవేరే వరకు హార్ముజ్‌ జలసంధి మూసివేతే!

ఇరాన్‌ విధించిన షరతులు నెరవేరే వరకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్‌ జలసంధిని మూసే ఉంచుతామని ఆ దేశ సైన్యాధిపతి మేజర్‌ జనరల్‌ అమీర్‌ హతామీ స్పష్టం చేశారు.  నవంబర్‌ 28న నిర్వహించిన నేవీ డే సందర్భంగా ఇరాన్‌ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్‌ నేవీ సిబ్బందిని అభినందిస్తూ హతామీ ఓ సందేశంలో వ్యూహాత్మక జలసంధిని మూసి ఉంచే మిషన్‌లో పాల్గొంటున్న నావికాదళ సిబ్బందిని ప్రశంసించారు. 

‘‘ఇరాన్‌ షరతులు నెరవేరే వరకు హార్ముజ్‌ జలసంధి మూసే ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నట్లు ఇరాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఎస్‌ఎన్‌ఏ వెల్లడించింది. ఇతర సాయుధ దళాలతో కలిసి ఇరాన్‌ నావికాదళం హార్ముజ్‌ జలసంధి, ఒమన్‌ సముద్రంలో ప్రత్యర్థుల బలహీనతలను బయటపెట్టిందని హతామీ వ్యాఖ్యానించారు. ‘‘ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌కు చెందిన శక్తిమంతమైన నావికాదళం, ఇతర సాయుధ బలగాలతో కలిసి ప్రపంచ అహంకార శక్తులను ఎదుర్కొంటోంది. హార్ముజ్‌ జలసంధి, ఒమన్‌ సముద్రంలో శత్రువుల బలహీనత, నిస్సహాయతను బయటపెట్టింది. సముద్రంలో వారికి వరుస ఓటముల రుచిని చూపించింది’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్‌పై ఎవరైనా దాడులకు పాల్పడితే ఏమాత్రం వెనుకాడకుండా ప్రతిఘటిస్తామని సైన్యాధిపతి హెచ్చరించారు. ఎలాంటి దురాక్రమణనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇరాన్‌ నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడం, దాడులకు పాల్పడే శత్రువులకు కఠినంగా బదులివ్వడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా డెనా, జమరాన్‌ నౌకలకు చెందిన నావికులతో సహా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి మరణాలకు ప్రతీకారం తీర్చుకునే విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నావికాదళ సిబ్బంది, వారి కుటుంబాల త్యాగాలను, పట్టుదలను హతామీ కొనియాడారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు.

మరోవైపు, పర్షియన్‌ గల్ఫ్‌, వ్యూహాత్మక హార్ముజ్‌ జలసంధి రక్షణలో ఇరాన్‌ నావికాదళం కీలక పాత్ర పోషిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్‌ అబ్బాస్‌ అరాగ్చీ పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలు సముద్ర జలాలపై ఇరాన్‌ అధికారాన్ని, ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో వ్యూహాత్మక స్థానాన్ని కాపాడటానికి దోహదపడుతున్నాయని తెలిపారు.

పర్షియన్‌ గల్ఫ్‌, హార్ముజ్‌ జలసంధి రక్షణ తమ దేశ జాతీయ భద్రత, ప్రయోజనాలకు అత్యంత కీలకమని అరాగ్చీ పేర్కొన్నారు. పేకాన్‌ ఫ్రిగేట్‌, డెనా డిస్ట్రాయర్‌ నౌకల్లో పనిచేసిన నావికుల త్యాగాలను ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. దేశ సముద్ర భద్రతకు వారు అందించిన సేవలను కొనియాడారు.

About The Author