కొత్త నియోజకవర్గాలకు శ్రీకారం.. నారీశక్తికి అధికారం!

లింగమనేని రమేష్,
పార్లమెంటు సభ్యులు, జనసేన పార్టీ.

ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు, ప్రభుత్వాల ఏర్పాటు మాత్రమే కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా పాలనా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం కూడా! ఈ దిశగా దేశ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యాన్ని పునఃసమీక్షించడం, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం వంటి కీలకాంశాలపై నవంబర్ 30 నుండి జరగనున్న పార్లమెంటు సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఇవి కేవలం స్థానాల సంఖ్యను పెంచడం లేదా మహిళలకు కోటా కల్పించే చర్యలు మాత్రమే కావు. ప్రజాస్వామ్య ప్రాతినిధ్యంలో సమతుల్యతను సాధించడం, మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచడం, రాష్ట్రాల హక్కులు, ప్రాంతీయ సమతౌల్యం, సమాఖ్య వ్యవస్థను పరిరక్షించడం వంటి విస్తృత లక్ష్యాలతో ముడిపడిన అంశాలు.

వికసిత్ భారత్ లక్ష్యంగా పరిపాలిస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. అందులో భాగంగా అన్ని ప్రాంతలకు సమాన స్థాయిలో అభివృద్ధి ఫలాలు అందాలనే లక్ష్యంగా కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే పార్లమెంట్‌ లో దక్షిణ భారత దేశం ప్రాతినిథ్యం తగ్గే అవకాశాలుండడంతో ఎన్డీఏ ప్రభుత్వం ఎవరికీ అన్యాయం జరగకుండా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న స్థానాలను 50 శాతానికి పెంచేందుకు రాజ్యాంగ సవరణ చేయనుంది. 

ఈ నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలకు సమ న్యాయం జరుగుతుంది. రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే జనాభా తక్కువున్న దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగేది. ఈ నేపథ్యంలో అందరికీ న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం 50 శాతం పెంపు ప్రతిపాదనతో ముందుకొచ్చింది. కొన్ని పార్టీలు నియోజకవర్గాల పెంపును వ్యతిరేకిస్తున్నాయి. 

ప్రతి నియోజకవర్గంలో జనాభా పెరుగుతున్న దశలో ఆ సదరు ప్రజాప్రతినిధి అక్కడి ప్రజలకు పూర్తి న్యాయం చేయలేపోతున్నారనేది వాస్తవం. దీంతో ప్రజందరికీ నియోజకవర్గం అభివృద్ధి ఫలాలు అందాలంటే పునర్విభజన జరగాల్సిన ఆవశ్యకత ఉంది. రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కల అనంతరం ప్రత పది సంవత్సరాలకు నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. 

అయితే 1973 తర్వాత నియోజకవర్గాల పెంపు జరగలేదు. భౌగోళిక సరిహద్దులను మార్చారే కానీ సీట్ల పెంపు చేపట్టలేదు. అయితే సీట్ల పెంపు ఆవశ్యకత గుర్తించిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ  ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం చారిత్రాత్మకం.

దక్షిణ భారతదేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత

నియోజకవర్గాల పునర్విభజన దక్షిణ భారతదేశానికి ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు జనాభా స్థిరీకరణ, విద్య, ఆరోగ్యం, మానవ వనరుల అభివృద్ధిలో ప్రగతిని సాధించాయి. దేశాభివృద్ధిలో భాగంగా జనాభా స్థిరీకరణ అనే జాతీయ లక్ష్య సాధనలో గణనీయమైన పాత్ర పోషించిన దక్షిణాది రాష్ట్రాలకు సముచిత గుర్తింపు లభించాల్సిన అవసరం ఉంది. 

ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాద‌న ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. పార్లమెంటు స్థానాలను 50 శాతం పెంచే ఈ ప్రతిపాదనతో లోక్‌సభ సభ్యుల సంఖ్య 543 నుంచి 816కు పెరుగుతుంది. దీనివల్ల ఐదు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 129 నుంచి 195 స్థానాలకు పెరిగి దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 24 శాతం ఉండనుంది. ఈ ప్రతిపాదన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం 25 నుంచి 38 స్థానాలకు, కర్ణాటక 28 నుంచి 42కు, తెలంగాణ 17 నుంచి 26కు, తమిళనాడు 39 నుంచి 59కు, కేరళ 20 నుంచి 30 స్థానాలకు పెరగవచ్చు.

వ్యూహాత్మకమైన ఈ  ప్రతిపాదనతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యానికి ఏమాత్రం భంగం కలగదు. ఒక ప్రాంతం వృద్ధి మరొక ప్రాంతం ప్రయోజనాలను దెబ్బతీయని ‘సహకార సమాఖ్య స్ఫూర్తి’కి ఇది అద్దం పడుతోంది. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్ర హోంమంత్రి ఇచ్చిన హామీలు స్పష్టమైన, శాశ్వతమైన చట్టపరంగా రూపొందుతుండడంతో ఈ ప్రక్రియపై రాష్ట్రాలకు విశ్వాసం కలుగుతుంది. 

సమాఖ్య నిర్మాణం భారత దేశ ప్రగతిలో కీలకం, వ్యవసాయం, తయారీ రంగం, సేవలు, ఎగుమతులు, పన్నుల ఆదాయం, ఉపాధి కల్పన, మానవ వనరుల అభివృద్ధి ద్వారా ప్రతి రాష్ట్రం జాతీయ ఆర్థిక వ్యవస్థకు తన వంతు సహకారాన్ని అందిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలు భారత ఆర్థికాభివృద్ధికి కీలక చోదక శక్తులుగా ఎదిగాయి. విద్య, ఆరోగ్యం, సాంకేతికత, పారిశ్రామికాభివృద్ధి, జనాభా నియంత్రణలో ఇవి సాధించిన విజయాలు దేశం అభివృద్ధి సూచికలను బలోపేతం చేశాయి.  

ప్రాంతీయ ఆకాంక్షలను బలంగా వినిపించే అవకాశం

దక్షిణాదిన కీలకమైన ఆంధ్రప్రదేశ్ కు నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన గొప్ప అవకాశాలను కల్పిస్తుంది. 38 లోక్‌సభ స్థానాలతో రాష్ట్ర అభివృద్ధి ప్రాధాన్యతలను, ప్రాంతీయ ఆకాంక్షలను జాతీయ స్థాయిలో బలంగా వినిపించే అవకాశం కలుగుతుంది. రాష్ట్రానికి వ్యవసాయం, ఆక్వాకల్చర్, ఓడరేవులు, సముద్ర వాణిజ్యం, లాజిస్టిక్స్, పారిశ్రామికాభివృద్ధి వంటి రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. 

ఉత్తరాంధ్రలో గిరిజన సంక్షేమం, మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానతపై నిరంతర దృష్టి అవసరం. రాయలసీమకు సాగునీరు, నీటి భద్రతలో స్థిరమైన పెట్టుబడులు అవసరం కాగా, కోస్తాంధ్ర వ్యవసాయం, ఆక్వాకల్చర్, పోర్టు ఆధారిత వృద్ధికి అపార అవకాశాలను అందిస్తోంది. పార్లమెంటులో పెరిగే ప్రాతినిధ్యంతో జాతీయ విధాన రూపకల్పనలో ఈ ప్రాధాన్యతలకు బలమైన స్థానం దక్కుతుంది.  

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్  ఇప్పుడు  నియోజకవర్గాల పెంపుతో అభివృద్ధిలో మరింత వేగంగా దూసుకుపోవడం ఖాయం.

ఆంధ్రప్రదేశ్ వంటి భౌగోళిక వైవిధ్యం ఉన్న రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల అందుబాటును కేవలం జనాభా ఆధారంగా మాత్రమే నిర్ణయించలేము. నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించేటప్పుడు మారుమూల గ్రామాలు, గిరిజన ఆవాసాలు, క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలు, రవాణా సవాళ్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించి పార్లమెంటును పౌరులకు మరింత చేరువ చేసేలా నియోజకవర్గాలను రూపొందించవచ్చు.

పెరిగే ప్రతి ఒక్క స్థానం ప్రజలకు మెరుగైన పాలన అందించడంతోపాటు, జవాబుదారీతనానికి, బాధ్యతాయుతమైన పాలనకు దోహదపడాలి.
జనాభాలో సగం ఉన్న మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పిస్తూ సంస్కరణలు చేపడితే దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. 

మహిళలకు రాజకీయ సాధికారత కల్పిస్తూ లోక్‌సభ, శాసనసభలలో వారికి మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన ‘నారీ శక్తి వందన్ అధినియం`2023’ భారత ప్రజాస్వామ్య పరిణామ క్రమంలో మైలురాయి. చిరకాలంగా పెండింగ్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లు కార్యరూపం దాల్చడానికి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారు. 

దేశ ప్రగతిలో భాగస్వాములైన మహిళలు వ్యవసాయం, పారిశ్రామిక, శాస్త్ర విజ్ఞానం, విద్య, పరిపాలన, ప్రజాసేవ ఇలా అన్ని రంగంల్లో రాణిస్తున్నారు. చట్టసభలలో వారికి ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించడం వల్ల వారి అనుభవాలు, దృక్పథాలు పాలనా విధానాల రూపకల్పనలో అంతర్భాగమవుతాయి. మహిళల అనుభవాలు విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వాతంత్య్రం, భావి తరాల అవకాశాలపై మరింత దృష్టి సారించేందుకు దోహదపడుతాయి.

మహిళా రిజర్వేషన్లు కేవలం ప్రాతినిధ్యానికి సంబంధించి మాత్రమే కాదు. ప్రజాస్వామ్యాన్ని మరింత సమ్మిళితంగా, సమాజానికి నిజమైన ప్రతిబింబంగా మార్చడానికి ఉద్దేశించింది. ఈ రిజర్వేషన్లపై  ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలి. ‘106వ రాజ్యాంగ సవరణ చట్టం`2023’ మూడో వంతు రిజర్వేషన్ల బిల్లు డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపడి ఉంది. ప్రతి రాష్ట్రం న్యాయబద్ధమైన ప్రయోజనాలను గౌరవిస్తూనే, ఈ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఇప్పుడు లభించింది.

జాతీయ అభివృద్ధి, రాష్ట్ర ఆకాంక్షలు రెండూ కలిసి నడవాలి 

జాతీయ అభివృద్ధి, రాష్ట్ర ఆకాంక్షలు రెండూ కలిసి నడవాలని ఎన్డీఏ కూటమిలో నిర్మాణాత్మక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ బలంగా విశ్వసిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తూనే, ఎన్డీయే అభివృద్ధి ఎజెండాకు సానుకూలంగా సహకరించడానికి జనసేన కృషి చేస్తుంది. 

కేంద్రం, రాష్ట్రాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి, భావి తరాలకు మరింత సమర్థవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను అందించడానికి మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ సంస్కరణలు గొప్ప అవకాశాలుగా మారుతాయి. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల గళాన్ని మరింత బలంగా వినిపించేందుకు ఈ సంస్కరణలో తోడ్పడుడుతాయి.

చారిత్రాత్మక నిర్ణయాల కోసం నిర్వహింస్తున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్మాణాత్మక చర్చలకు, జాతీయ ఏకాభిప్రాయ సాధనకు ఒక వేదికగా చూడాలి. డీలిమిటేషన్ ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని విస్తరించగలదు, మహిళా రిజర్వేషన్ రాజకీయ భాగస్వామ్యాన్ని మరింత లోతుగా పెంచగలదు. దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభించి అభివృద్ధి, అవకాశాలు సమాన స్థాయిలో లభిస్తాయి. 

దేశం ‘వికసిత్ భారత’ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ కీలక తరుణంలో అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ, సమ్మిళిత ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబిస్తూ, రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని కాపాడే పటిష్ఠమైన చట్టసభలను నిర్మించుకోవడం మనందరి ఉమ్మడి బాధ్యత.

About The Author