దేశంలో యాసిడ్ దాడులను శాశ్వతంగా అరికట్టే దిశగా.ప్రైవేటు వ్యక్తులు రిటైల్‌గా యాసిడ్ అమ్మడంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, డోర్ డెలివరీ సర్వీసుల ద్వారా యాసిడ్ విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టంచేసింది. ఎలాంటి నియంత్రణ లేకుండా యాసిడ్ సులభంగా అందుబాటులో ఉండటమే యాసిడ్ దాడులు జరగడానికి ప్రధాన కారణమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
యాసిడ్ దాడి బాధితురాలు షాహీన్ మాలిక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీచేసింది. గతంలో జారీచేసిన మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కాకపోవడంపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఇకపై వైద్య అవసరాల కోసం యాసిడ్‌ను కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఫార్మసీల ద్వారా మాత్రమే విక్రయించాలి.
అందుకు కూడా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ లేదా సివిల్ సర్జన్ నుంచి ముందస్తుగా లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. యాసిడ్ కొనుగోలు చేసే వ్యక్తి గుర్తింపు, చిరునామా, సంప్రదింపుల వివరాలు, ఎంత పరిమాణంలో కొంటున్నారు, ఏ ప్రయోజనం కోసం వినియోగిస్తున్నారు అనే వివరాలతో కూడిన నిర్దిష్ట ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది. అంతేకాకుండా యాసిడ్ దుర్వినియోగానికి సంబంధించి కొనుగోలుదారుడిపై పూర్తి బాధ్యత మోపాలని సుప్రీంకోర్టు సూచించింది.
కొనుగోలుదారుడికి తెలియకుండా వేరొకరు ఆ యాసిడ్‌ను దుర్వినియోగం చేసినా, దాని బాధ్యత కొన్నవారే వహించాల్సి ఉంటుంది. బాధితుల చికిత్స ఖర్చులు లేదా పరిహారం చెల్లింపు కోసం, అవసరమైతే కొనుగోలుదారుడి స్థిరాస్తుల వివరాలు సేకరించి వాటిని జప్తు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని కోర్టు పేర్కొన్నది.
2013లో ‘లక్ష్మి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ఇచ్చిన ఆదేశాలు, పాయిజన్స్ యాక్ట్-1919 కింద ఉన్న నిబంధనలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో బాధితులకు అండగా నిలిచేందుకు ఒక సమగ్ర విధానాన్ని రూపొందించే బాధ్యతను జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థకు అప్పగించింది.
ప్రథమ చికిత్స, చట్టపరమైన హక్కులు, పునరావాసం వంటి అంశాలపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాలని సూచించింది. ఈ ప్రతిపాదనలపై తీసుకున్న చర్యలను వివరిస్తూ రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.

More Stories
వడోదరలో జెఏఏం ఉగ్రవాది ఏకె-47 రైఫిల్‌తో అరెస్ట్
సైబర్ మోసాల నుండి 164 మంది విదేశీయులకు విముక్తి
నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశాలు