తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఎమ్మెల్యే అరుల్ విగ్నేష్‌ను జిల్లా కలెక్టర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపారనే ఆరోపణలపై శుక్రవారం కల్లకురిచ్చిలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. మెజిస్ట్రేట్ కోర్టు నుంచి వారెంట్ పొందిన ప్రత్యేక పోలీసు బృందం శుక్రవారం సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకుంది. అరెస్టు అనంతరం, పోలీసులు ఎమ్మెల్యేను వాహనంలో తరలించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
గతంలోనే, టీవీకే ఎమ్మెల్యే అరుల్ విగ్నేష్ కల్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపారని, మద్యం మత్తులో ఆమె నివాసానికివెళ్లారని ఆరోపణలు వచ్చాయి. వేధింపులకు సంబంధించి మహిళా కలెక్టర్ ఇటీవల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మూడు రోజుల క్రితం కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. మరోవైపు, ఈ వ్యవహారంపై దర్యాప్తును ఐజి స్థాయి అధికారి పర్యవేక్షించాలని మద్రాస్ హైకోర్టు ఇటీవల ఆదేశించింది.
అన్నాడిఎంకెకు చెందిన ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనపై పోలీసులు ‘మహిళా వేధింపుల నిరోధక చట్టం’లోని ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అసభ్యకరమైన వాట్సాప్ సందేశాలు పంపడం, అనుచితంగా ప్రవర్తించడం, వంటి ఆరోపణలు ఎమ్మెల్యేపై ఉన్నాయి. కాగా మూడు రోజుల క్రితం అరుల్ విఘ్నేష్‌పై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నందుకు టీవీకే ప్రభుత్వాన్ని మదురై కోర్టు నిలదీసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విఘ్నేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్ సి డబ్ల్యు) స్వయంగా స్పందించి, కేసును పరిగణనలోకి తీసుకుంది. గతంలో కూడా ఆయన అసభ్యంగా ప్రవర్తించారని, అంతేకాకుండా మద్యం మత్తులో కలెక్టర్ నివాసానికి వెళ్లారని మీడియాలో వచ్చిన కథనాలను ఎన్సీ డబ్ల్యు తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంది. ఈ ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరుతూ, ఎన్ సి డబ్ల్యు చైర్పర్సన్ విజయ రహత్కర్ తమిళనాడు డీజీపీకి లేఖ రాశారు.
అలాగే, ఏడు రోజుల్లోగా తీసుకున్న చర్యల గురించి సమగ్ర నివేదికను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. ప్రతిపక్ష నాయకులు ఈ ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. డీఎంకే నేత ఎం.కె. స్టాలిన్ రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, “ఒక జిల్లా కలెక్టరే ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే, ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏమిటి?” అని ప్రశ్నించారు.
మరోవైపు, తమిళనాడు మంత్రి సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ స్పందిస్తూ, ఈ ఆరోపణలు కనిమోజి సోషల్ మీడియాలో షేర్ చేసిన అవాస్తవ సమాచారం అని కొట్టిపారేశారు.

More Stories
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతుపై భరోసా!
కొలీజియం సిఫార్సులు ఓ నిర్దిష్టవర్గంకే అనుకూలం
ఇరాన్‌పై సోనియా గాంధీ ‘ప్రేమ’ను ప్రశ్నించిన ఇజ్రాయెల్ రాయబారి