నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు శరద్ పవర్, జగన్ మద్దతు

ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి ముందు ఒక కీలక రాజకీయ పరిణామంలో, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి-ఎస్‌పి), వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని  వైఎస్సార్‌సీపీ కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. 

శుక్రవారం ఎన్‌సిపి-ఎస్‌పి అధినేత శరద్ పవార్‌తో సమావేశమైన అనంతరం పార్టీ ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాద్ ఈ నిర్ణయాన్ని ధృవీకరించారు. లోక్‌సభలో ఎనిమిది మంది సభ్యులున్న ఈ పార్టీ, ప్రతిపాదిత చట్టానికి తన మద్దతును ప్రకటించే అవకాశం ఉంది. ఇది, బిల్లును ఆమోదించడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఊతం ఇచ్చే అవకాశం ఉంది. 

ముంబైలో శరద్ పవార్‌తో సమావేశమైన అనంతరం అవ్హాద్ పార్టీ వైఖరిని ధృవీకరించారు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై ఎన్‌సిపి-ఎస్‌పి వైఖరి, ప్రతిపక్ష ఐక్యతపై దాని ప్రభావం గురించి ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 

పవార్‌తో జరిగిన చర్చ గురించి వివరిస్తూ అవ్హాద్ ఇలా పేర్కొన్నారు, ” నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ రాజ్యాంగబద్ధమైన అవసరం అనేదే ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం, మేం దానికి కచ్చితంగా మద్దతు ఇస్తాం. పునర్విభజనకు మేం మద్దతు ఇస్తాం.” 

అయితే, ప్రతిపాదిత చట్టంలోని నిర్దిష్ట నిబంధనలపై అభిప్రాయం చెప్పే ముందు, పార్టీ ఆ చట్టాన్ని పరిశీలిస్తుందని కూడా అవ్హాద్ స్పష్టం చేశారు. “మేము బిల్లును కచ్చితంగా అధ్యయనం చేస్తాం; అందులో ఎలాంటి సందేహం లేదు. నియోజకవర్గాల పునర్విభజన విషయానికొస్తే, సుప్రియా తాయి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే అంతా చూసుకుంటాం,” అని ఆయన తెలిపారు. 

మరోవంక, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే దానికి మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఈ ప్రక్రియ ప్రాంతీయ సమతుల్యతకు భంగం కలిగించకుండా ఉండేందుకు తగిన రక్షణలు కావాలని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ఆ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. 

కాగా, జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన కారణంగా తమ పార్లమెంటరీ ప్రాతినిధ్య వాటాను కోల్పోతామని గతంలో భయపడిన దక్షిణ రాష్ట్రాలకు ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంటూ, లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచాలన్న ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారు.

 ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ (అందరితో కలిసి, అందరి అభివృద్ధి) అనే సూత్రం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రాత్మక చొరవగా తాను అభివర్ణించిన దానికి మద్దతు ఇవ్వడానికి వచ్చానని తెలిపారు.  దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు ఆయన ప్రధానమంత్రిని అభినందించారు.

About The Author