భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది చివరలో కుదిరే అవకాశం ఉందని పీయూష్ గోయల్ స్పష్టంచేశారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి ఇది అమల్లోకి రావొచ్చని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో భారత్ 38 అభివృద్ధి చెందిన దేశాలతో తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసిందని పేర్కొన్నారు. ఈ డీల్స్ ద్వారా 70 ట్రిలియన్ డాలర్ల ఉమ్మడి జీడీపీ కలిగిన ఆర్థికవ్యవస్థలలో ప్రాధాన్యతా మార్కెట్ ప్రాప్యతను పొందిందని గుర్తు చేసుకున్నారు.
చర్చల దశలో ఉన్న మరో 8-9 ఒప్పందాలతో ఇది 85 ట్రిలియన్ డాలర్లకు విస్తరించవచ్చని గోయల్ అభిప్రాయపడ్డారు. సంఘర్షణలు, చమురు ధరల షాక్‌లు, సుంకాల సంబంధిత అంతరాయాలతో సహా ప్రపంచవ్యాప్త అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత్ తన వృద్ధి వేగాన్ని కొనసాగించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత వృద్ధి కథపై ప్రపంచానికి ఉన్న నమ్మకం ఒక్కటే స్థిరంగా నిలిచిందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని గోయల్ తెలిపారు. సెప్టెంబర్ త్రైమాసికంలో కూడా ఆర్థికవ్యవస్థ ఇదే మార్గంలో కొనసాగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. స్థూల మూలధన నిర్మాణం సుమారు 12 శాతం పెరిగిందని, బ్యాంకు రుణాలు సుమారు 19 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో ఎగుమతులు సుమారు 570 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వివరించారు.
మే నెలలో నిర్దేశించుకున్న 1 ట్రిలియన్ డాలర్ల వార్షిక ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్ పయనిస్తోందని గోయెల్ తెలిపారు. అక్టోబర్ ఎగుమతులు రికార్డు స్థాయిలో దాదాపు 90 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తెలిపారు. ఈ పనితీరుకు ఎగుమతిదారులు, తయారీదారులు, సేవా ప్రదాతలు, వ్యవసాయ, మత్స్య ఎగుమతిదారులే కారణమని చెప్పారు.

More Stories
విదేశాల్లో 65 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ
మేకిన్ ఇండియా ప్రక్రియకు సవాల్‌గా ట్రంప్ 25 శాతం సుంకాలు
చంద్రశేఖరన్ నియామకంపై కోర్టుకెక్కిన టాటా ట్రస్ట్స్