సెప్టెంబర్ 17న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లపాటు చైర్మన్‌గా కొనసాగిస్తూ తీర్మానం ఆమోదించారు. అయితే, ఈ తీర్మానం చెల్లుబాటు కాదని టాటా ట్రస్టులు వాదిస్తున్నాయి. కంపెనీ నిబంధనావళి (ఏఓఏ)లోని ఆర్టికల్ 121 ప్రకారం, చైర్మన్ పునర్నియామకానికి అవసరమైన అనుకూల ఓట్లు రాలేదని పేర్కొన్నాయి. టాటా సన్స్ బోర్డులో ట్రస్టుల తరఫున నామినీ డైరెక్టర్లుగా ఉన్న నోయెల్ టాటా, వేణు శ్రీనివాసన్ ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
చంద్రశేఖరన్ పునర్నియామకానికి వేణు శ్రీనివాసన్ మద్దతు తెలపగా, నోయెల్ టాటా వ్యతిరేకంగా ఓటు వేశారు. టాటా సన్స్‌లో టాటా ట్రస్టులకు 66 శాతం వాటా ఉంది. నిబంధనావళి ప్రకారం, ట్రస్టులు నామినేట్ చేసిన డైరెక్టర్లలో అవసరమైన మెజారిటీ మద్దతు లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోరాదని ట్రస్టులు చెబుతున్నాయి. ఈ నిబంధనను పాటించకుండా చంద్రశేఖరన్ పునర్నియామక తీర్మానాన్ని ఆమోదించారని ఆరోపిస్తున్నాయి.
సెప్టెంబర్ 20న విడుదల చేసిన ప్రకటనలోనూ ఈ తీర్మానం చెల్లదని, దానికి చట్టపరమైన ప్రభావం లేదని స్పష్టం చేశాయి. సెప్టెంబర్ 17 తర్వాత ఈ అంశంపై టాటా సన్స్‌కు ట్రస్టులు పలుమార్లు లేఖలు పంపినప్పటికీ సానుకూల స్పందన రాలేదని పిటిషన్లలో పేర్కొన్నాయి. దీంతో బుధవారం రాత్రి కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకుని గురువారం దావాలు దాఖలు చేశాయి.
నవంబర్ 30న టాటా సన్స్ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో, ఆ సమావేశంలో చంద్రశేఖరన్ తన నిర్ణయాత్మక ఓటు హక్కును వినియోగించకుండా అడ్డుకోవాలని కోరాయి. నామినీ డైరెక్టర్ల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు బోర్డు సమావేశానికి అధ్యక్షత వహించే చైర్మన్‌కు నిర్ణయాత్మక ఓటు వేసే అధికారం లేదని ట్రస్టులు వాదిస్తున్నాయి.
ముఖ్యంగా ట్రస్టీల మెజారిటీ మద్దతు అవసరమైన అంశాల్లో ఆర్టికల్ 121 ఈ అధికారాన్ని కల్పించదని పేర్కొన్నాయి. అయితే, బోర్డు సమావేశంపై స్టే విధించాలని ట్రస్టులు కోరలేదు. చంద్రశేఖరన్ మాత్రమే నిర్ణయాత్మక ఓటు వేయకుండా ఆదేశించాలని పిటిషన్లలో విజ్ఞప్తి చేశాయి. రెండు ట్రస్టుల తరఫున సీనియర్ న్యాయవాది జనక్ ద్వారకాదాస్ గురువారం అత్యవసర విచారణ కోరుతూ జస్టిస్ ఆరిఫ్ డాక్టర్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ముందు పిటిషన్లను ప్రస్తావించారు.
అయితే, జస్టిస్ ఆరిఫ్ ఈ కేసు నుంచి తప్పుకున్నారు. అనంతరం ప్రత్యామ్నాయ ధర్మాసనంలోని జస్టిస్ అభయ్ అహుజా ముందు పిటిషన్లను ప్రస్తావించారు. నవంబర్ 30న బోర్డు సమావేశం జరగనున్నందున అంతకంటే ముందే విచారణ చేపట్టాలని ద్వారకాదాస్ కోరారు. దీంతో ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి తెలిపారు. చంద్రశేఖరన్ పునర్నియామక తీర్మానంలో నిబంధనావళిని పాటించలేదన్నది టాటా ట్రస్టుల ప్రధాన వాదన.

More Stories
కార్తీక దీపం వివాదంలో తమను సంప్రదించ లేదంటున్న అర్చకులు
అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా 2036 ఒలింపిక్
మీడియా సిబ్బందికి అత్యంత ప్రాణాంతకమైన ప్రదేశంగా పాలస్తీనా