సీపీ రమేష్ రెడ్డి, డీసీపీ కోటిరెడ్డిలకు జైలు శిక్ష!

న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేసిన ఉన్నత పోలీస్ అధికారులపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.  సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ రమేష్‌రెడ్డి, మేడ్చల్‌ డీసీపీ కోటిరెడ్డిలకు జైలు శి విధిస్తూ హైకోర్టు సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. 

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను సీపీ రమేష్ రెడ్డి, డీసీపీ కోటిరెడ్డిలకు ఉన్న‌త న్యాయ స్థానం రెండు వారాల జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధించింది. వివ‌రాల్లోకి వెళ్తే ఒక భూ వివాదానికి సంబంధించిన కేసులో పిటిషనర్‌కు రక్షణ కల్పించాలంటూ గతంలో ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసినందుకు కోర్టు ధిక్కరణ కింద ఈ శిక్షను విధించింది.

ఒక భూవివాదానికి సంబంధించిన కేసులో పిటిషనర్‌కు తగిన పోలీసు రక్షణ కల్పించాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడంలో సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి నిర్లక్ష్యం వహించారని పిటిషనర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. 

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, అధికారుల తీరును తప్పుబడుతూ ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో వారం రోజుల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. 

అయితే, సదరు పోలీస్ అధికారులు ఈ తీర్పుపై పైకోర్టులో (డివిజన్ బెంచ్) అప్పీల్ చేసుకునేందుకు వీలుగా, జైలు శిక్ష అమలును వారం రోజుల పాటు తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది. వారం రోజుల్లోగా ఉన్నత న్యాయస్థానం నుంచి స్టే ఉత్తర్వులు తీసుకురాని పక్షంలో, హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

About The Author