అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద జరిపిన దర్యాప్తు అనంతరం, భారతీయ వస్తువులపై 25% వరకు సుంకాలు విధించాలన్న ప్రతిపాదనతో వాషింగ్టన్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో, తమ తయారీ రంగ విధానాలు నిర్మాణాత్మక అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని సృష్టిస్తున్నాయన్న అమెరికా ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్టీఆర్) జారీ చేసిన నోటీసును ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఏ రంగంలోనూ భారత్కు నిర్మాణాత్మక అదనపు ఉత్పత్తి సామర్థ్యం లేదని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
దర్యాప్తు ప్రక్రియ అంతటా భారత్ నిర్మాణాత్మకంగా సహకరించిందని కూడా తెలిపింది. దర్యాప్తు సమయంలో వాణిజ్య శాఖ తన నివేదికలలో ఈ ఆరోపణలను తిరస్కరించిందని కూడా ప్రభుత్వం పేర్కొంది. దేశీయ డిమాండ్, కీలకమైన ముడిసరుకుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరమే తమ తయారీ రంగ విస్తరణకు కారణమని భారత్ స్పష్టం చేసింది. భారత్ తన అవసరానికి మించి ఉత్పత్తి చేస్తోందని, తన మార్కెట్లోకి ప్రవేశాన్ని కష్టతరం చేస్తుందని, కార్మికులకు తగినంత రక్షణ కల్పించడం లేదని ఇవన్నీ అమెరికా కంపెనీలకు నష్టాన్ని కలిగిస్తున్నాయని అమెరికా వాదిస్తోంది.
అంతకు ముందు, భారత్, చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్ సహా మొత్తం 14 ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కొత్త టారిఫ్స్ (దిగుమతి సుంకాలు) విధించనున్నట్లు అమెరికా ప్రతిపాదించింది. ఆయా దేశాల్లోని అధిక పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం అమెరికా వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళనతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అంటే తమకు అవసరమైన వాటి కంటే ఎక్కువగా పారిశ్రామిక వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాయని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది.
అలాగే, టారిఫ్లపై ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కోల్పోయిన ఆదాయాన్ని అదనపు సుంకాల ద్వారా భర్తీ చేసుకోవాలని యోచిస్తోంది. ఈ టారిఫ్ల వివరాలను అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్ ) కార్యాలయం పోస్ట్ చేయడానికి ముందే ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.ఇవి ప్రతిపాదన దశలోనే ఉన్నాయని, వాటి అమలుకు సంబంధించి కచ్చితమైన కాలపరిమితిని ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.
అదనపు సుంకాలతో తయారీ రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయని, ఫెడరల్ లోటు తగ్గుతుందని ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే, గత ఏడాది విధించిన సుంకాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో భవిష్యత్తులో సుంకాలు విధించాలంటే కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి చేయాలని డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.
తక్కువ ధరలకు వస్తువులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తూ అమెరికన్ కంపెనీలను దెబ్బతీస్తున్నాయని ట్రంప్ యంత్రాంగం వాదిస్తోంది. సుంకాల బెదిరింపులతో పలు దేశాలతో ట్రంప్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగానే ఈ కొత్త సుంకాలు ఉంటాయని ఆ అధికారి విలేకరులకు తెలిపారు.

More Stories
భారత్, చైనా, ఈయూలపై అమెరికా కొత్త సుంకాలు?
ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
950 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్..!