ఐటీ కారిడార్‌ హాస్టల్‌లో 8 మందికి డ్రగ్స్ టెస్ట్.. ఆరుగురికి పాజిటివ్

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో గంజాయి, డ్రగ్స్ వినియోగం మరోసారి తీవ్ర కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఓ పురుషుల పీజీ హాస్టల్‌లో ఈగల్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడి కావడం సంచలనంగా మారింది. మొత్తం 8 మందికి మూత్ర పరీక్షలు నిర్వహించగా, ఆరుగురికి టెట్రాహైడ్రోకాన్నబినాల్ పాజిటివ్‌గా వచ్చింది. 
 
వీరిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ముగ్గురు అమెజాన్ డెలివరీ బాయ్స్, ఒక ఫార్మసిస్ట్ ఉన్నట్లు ఈగల్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. హాస్టల్‌లో గంజాయి వినియోగం జరుగుతోందని ఈగల్ ఫోర్స్ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 1908కు సమాచారం అందింది. దీంతో అధికారులు గురువారం ఆకస్మికంగా హాస్టల్‌కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. 
 
పాజిటివ్‌గా వచ్చిన ఆరుగురిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. ఐటీ ఉద్యోగులు, యువత ఎక్కువగా నివసించే పీజీ హాస్టళ్లలో డ్రగ్స్ వినియోగంపై ఈగల్ ఫోర్స్ ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలె కొన్ని రోజుల క్రితం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దిక్‌నగర్‌లో ఉన్న హరిహర జ్ఞానేశ్వర పురుషుల పీజీ హాస్టల్‌లో నిర్వహించిన తనిఖీల్లో గంజాయి పట్టుబడటం గమనార్హం.
 
నవీన్ అనే వ్యక్తి వద్ద 5 గ్రాములు, జయంత్ వద్ద 10 గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సిగరెట్ల తయారీకి ఉపయోగించే ప్రీ-రోల్డ్ కోన్స్‌ను కూడా పట్టుకున్నారు. విచారణలో బాబులు ఠాకూర్ అలియాస్ బబ్లూ, థాపన్, కృష్ణ అనే ముగ్గురు వ్యక్తుల నుంచి 5 గ్రాముల గంజాయి ప్యాకెట్‌ను రూ.600కు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ ముగ్గురి పాత్రపై మరింత విచారణ కొనసాగుతోంది.

హాస్టల్‌కు అర్ధరాత్రి సమయంలో బయటి వ్యక్తులు కూడా వచ్చి గంజాయి సేవిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కోణంలోనూ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. హాస్టల్‌కు గంజాయి సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం. మాదాపూర్‌తో పాటు గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లోని పీజీ హాస్టళ్లపై ఈగల్ ఫోర్స్ నిఘా పెంచింది. డ్రగ్స్ వినియోగం, సరఫరా నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు ఆకస్మిక తనిఖీలు కొనసాగించే అవకాశం ఉంది.

About The Author