సౌదీ రాజధానిపై హౌతీల దాడి.. ఇద్దరు భారతీయులకు గాయాలు

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో హౌతీ మిలీషియా దాడికి పాల్పడింది. కింగ్‌ అబ్దుల్లా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఓ టవర్‌ను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు భారతీయులు, ముగ్గురు నేపాల్‌ పౌరులు ఉన్నట్లు సౌదీ అరేబియా పౌర రక్షణ విభాగం వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు సౌదీ పౌరులు, ఇద్దరు భారతీయులు, ముగ్గురు నేపాల్‌ పౌరులు, నలుగురు ఈజిప్టు పౌరులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

దాడి జరిగిన వెంటనే సంబంధిత భద్రతా, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. యెమెన్‌లోని అల్-హుదైదా గవర్నరేట్‌లో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు వైమానిక దాడులు చేశాయన్న ఆరోపణల నేపథ్యంలో, సౌదీ అరేబియా, యెమెన్ హౌతీ అధికారుల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 

ఈ ఘటనను హౌతీ మిలీషియా జరిపిన ఉగ్రదాడిగా సౌదీ పౌర రక్షణ విభాగం అభివర్ణించింది. అంతకుముందు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ తుర్కీ అల్‌ మాలికి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఓ టవర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు. ఘటనాస్థలిలో సంబంధిత అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

మరోవైపు సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయులు స్థానిక చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అక్కడి భారత రాయబార కార్యాలయం సూచించింది. గతంలోనూ రియాద్‌పై దాడులకు పాల్పడినట్లు హౌతీలు ప్రకటించుకున్న సందర్భాలున్నాయి.

“రియాద్‌లో ఈరోజు జరిగిన దాడిలో ఇద్దరు భారతీయ పౌరులు గాయపడినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను రాయబార కార్యాలయం సేకరిస్తోంది. గాయపడిన వారికి, వారి కుటుంబాలకు సాధ్యమైన అన్ని విధాలా సహాయం అందజేస్తాం” అని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా పేర్కొంది.

నవంబర్ 19న, సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ఆర్థిక జిల్లాలో హూతీల దాడి వల్ల ఒక భవనం దెబ్బతిన్నట్లు ధృవీకరించింది. అంతకుముందు, రాజధానిలో ఒక భారీ పేలుడు సంభవించగా, దేశపు సార్వభౌమ సంపద నిధి ప్రధాన కార్యాలయం ఉన్న నగరంలోని అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యం దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి.

 

About The Author