రేణిగుంట మండలం ఆంజనేయపురంలోని అభయ ఆంజనేయస్వామి ఆలయ తరలింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి “హే రామ్! ఆలయాలను రక్షించండి” అంటూ సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలను రెచ్చగొట్టి, రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు జగన్మోహన్ రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆమె ఖండించారు.
కడప – రేణిగుంట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆలయ తరలింపు ప్రక్రియ ఈరోజు మొదలైంది కాదని, 2022-2023 మధ్య కాలంలో, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జాతీయ రహదారుల ఈ భూసేకరణ చేపట్టారని ఆమె గుర్తు చేశారు. నాడు ఆయన ప్రభుత్వ హయాంలోనే ఆలయ ఈవో ఖాతాలో రూ. 59.30 లక్షల నష్టపరిహారం జమ అయిందని చెబుతూ అప్పుడు సంతకాలు పెట్టించి, నేడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం జగన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది పల్లవ రాజులు కట్టించిన వందల ఏళ్ల నాటి పురాతన క్షేత్రమంటూ భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆమె విమర్శించారు. ఇది సుమారు 60-70 ఏళ్ల క్రితం గ్రామస్థులు నిర్మించుకున్న ఆలయం మాత్రమేనని, గర్భగుడికి ఎటువంటి నష్టం జరగలేదని స్వయంగా ఆ ఆలయ అర్చకులే మీడియా ముందుకు వచ్చి వైసీపీ దుష్ప్రచారాన్ని ఎండగట్టారని ఆమె తెలిపారు.
జాతీయ రహదారి అధికారులు సమీపంలోనే 50 సెంట్ల ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించారని, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యవేక్షణలో, వేద పండితుల ఆధ్వర్యంలో ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం అత్యంత భక్తిశ్రద్ధలతో ముందుగా ‘బాలాలయం’ నిర్మించి, విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్టించిన తర్వాతే పాత నిర్మాణాలను తొలగించారని ఆమె చెప్పారు.
అంతర్వేది రథం దగ్ధం అయినప్పుడు, రామతీర్థంలో కోదండరాముని విగ్రహ శిరస్సును ఖండించినప్పుడు, దుర్గగుడి వెండి సింహాలు మాయమైనప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా వందలాది హిందూ దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి నోటి నుండి ఒక్కసారి కూడా “హే రామ్” అనే మాట ఎందుకు రాలేదు? అని ఆమె ప్రశ్నించారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో దేవాలయాల భూములు అన్యాక్రాంతమైనా, దేవాదాయ శాఖ నిధులను దారి మళ్లించినా, అర్చకులపై దాడులు జరిగినా కనీసం పట్టించుకోని వీరు నేడు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో కబుర్లు చెప్పడం హాస్యాస్పదం అంటూ యామిని శర్మ ధ్వజమెత్తారు.

More Stories
బెంగళూరు విమానాశ్రయం వద్ద షర్మిల అడ్డగింత
శ్రీశైలం మల్లన్న ఆలయానికి రైలు మార్గం!
సింహాచలం ఆలయంలో సాంప్రదాయ దుస్తులతోనే ప్రవేశం