‘నషా ముక్త్ భారత్’ ఓ సామాజిక ఉద్యమం


ప్రపంచంలో మరే దేశంలో లేనంతటి యువ జనాభా మన భారత్ సొంతమని, అలాంటి యువతను డ్రగ్స్ మహమ్మారి బారి నుండి కాపాడుకోకపోతే దేశ భవిష్యత్తు అంధకారమవుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘నషా ముక్త్ భారత్ – హైదరాబాద్ వాక్స్’ పాదయాత్ర సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం పోలీసులదో, ప్రభుత్వాలదో కార్యక్రమం కాదని, ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు, మీడియా ప్రతినిధి, సోషల్ మీడియా వారియర్ భాగస్వాములయ్యే మహా ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు.

ఒకప్పుడు వ్యవసాయం, ఇంజనీరింగ్, ఆటోమొబైల్ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన పంజాబ్ రాష్ట్రం, నేడు ఇంటింటికీ డ్రగ్స్ వ్యాపించి ఏ విధంగా నిర్వీర్యమవుతోందో మన కళ్లముందే చూస్తున్నామని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహమ్మారి క్రమంగా హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరిస్తోందని, మనం ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే దేశవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. 

 
పొరుగు దేశాల్లోని భారత వ్యతిరేక, ఉగ్రవాద శక్తులు తమ ఆర్థిక మూలాలను బలోపేతం చేసుకునేందుకు మన దేశంలోకి డ్రగ్స్ సరఫరా చేస్తూ, ఆ డబ్బుతో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.   గంటల తరబడి మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాలో గడుపుతూ యువత కొత్త స్నేహాల ద్వారా మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని, దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 25 శాతం మంది యువత ఏదో ఒక రూపంలో మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు.
డ్రగ్స్ కేవలం ధనికుల పిల్లల సమస్య మాత్రమే కాదని, హైదరాబాద్‌లోని అంబర్‌పేట, బోరబండ వంటి బస్తీల్లోని పేద (బిపిఎ) కుటుంబాల యువత కూడా గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని చెప్పారు.  ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం 2029 నాటికి ‘నషా ముక్త్ భారత్’ సాధించాలనే లక్ష్యంతో పటిష్ట కార్యాచరణ రూపొందించిందని కిషన్ రెడ్డి వివరించారు.  
 
అయితే, డ్రగ్స్ వాడే యువతను నేరస్థుల్లా చూడకూడదని, ఆ తప్పు యువతది కాదు.. ఆ డ్రగ్స్‌దేనని ఆయన తెలిపారు.  దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది యువతకు అవగాహన కల్పించడంతో పాటు, మొదటి దశలో లక్ష మంది ‘నషా ముక్త్ భారత్ మిత్ర’ వాలంటీర్లను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. డీ-అడిక్షన్ కేంద్రాల నుండి కోలుకుని బయటకు వచ్చిన యువతకు మధ్యలో ఆగిపోయిన చదువును తిరిగి అందించడంతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.

About The Author