* 300 మందిని చంపడమే లక్ష్యం.. ఎల్ఈటి పేరుతో ఈ మెయిల్
హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరుపుతామంటూ వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్ కలకలం రేపింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ ‘లష్కర్-ఏ-తొయిబా’ (ఎల్ఈటి) పేరుతో ఈ సందేశం వచ్చిందని, నగరంలోని రెండు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించినట్లు పోలీసులు వెల్లడించారు.
కాచిగూడలోని హోటల్ టూరిస్ట్ ప్లాజా, కాచిగూడ రైల్వే స్టేషన్లో పేలుళ్లు జరిపి కనీసం 300 మందిని చంపుతామని అందులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నవంబర్ 21న హైదరాబాద్ నగర పోలీసు స్పెషల్ బ్రాంచ్ జారీ చేసిన హెచ్చరిక ప్రకారం ‘లష్కరే తోయిబా’ పేరుతో వచ్చిన ఈ-మెయిల్లో పంపిన వ్యక్తి ఆ ఉగ్రవాద సంస్థకు చెందినవాడినని చెప్పుకున్నాడు.
2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడుల తరహాలో హైదరాబాద్‌లోనూ దాడులు చేస్తామని బెదిరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కాశ్మీర్లో భారత సైన్యం చేతిలో లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్, అతని సహచరులు హతమైనందుకు ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడతామని ఈ-మెయిల్లో పేర్కొన్నారు.
నవంబర్ 18న జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా జంగల్పోరా ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో లతీఫ్ భట్ హతమైనట్లు వార్తలు వెలువడ్డాయి. నిర్దిష్ట ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు రావడంతో ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు పొంచి ఉండవచ్చని స్పెషల్ బ్రాంచ్ హెచ్చరించింది.
నగరంలోని అన్ని జోన్ల పోలీసు స్టేషన్ల అధికారులతోపాటు ఏసీపీలు, డీసీపీలు, ట్రాఫిక్ విభాగం, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ముఖ్యంగా హోటల్ టూరిస్ట్ ప్లాజా, కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద భద్రత, నిఘా పెంచాలని సూచించింది. రద్దీగా ఉండే ప్రాంతాలు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రార్థనా స్థలాలు, ఇతర కీలక సంస్థల వద్ద కూడా నిఘా కట్టుదిట్టం చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
అనుమానాస్పద వ్యక్తులు, నిర్లక్ష్యంగా వదిలివెళ్లిన వస్తువులు, వాహనాలు, అసాధారణ కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పెట్రోలింగ్ పెంచడంతోపాటు విధ్వంసక చర్యల నిరోధక తనిఖీలు నిర్వహించాలని, ఇతర భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. నగర పోలీసు స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ జారీ చేసిన ఈ హెచ్చరికను ఉన్నతాధికారులు, సంబంధిత విభాగాలకు పంపించారు.
మరోవైపు, లష్కరే తోయిబా పేరుతో వచ్చిన బెదిరింపు మెయిల్ నిజంగా ఉగ్రవాద సంస్థ నుంచే వచ్చిందా? లేదా ఎవరైనా కావాలనే ఆ పేరుతో పంపించారా? మెయిల్ ఎక్కడినుంచి పంపించారనే కోణంలో మెయిల్ వెనకఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు.

More Stories
రేపే కరీంనగర్ లో బిజెపి మహా పాదయాత్ర… నితిన్ నబిన్ రాక
వేయేళ్లు వేములవాడ ఆలయం కట్టడాలు, విగ్రహాలపై అనుమానాలు
డ్రగ్స్ రహిత భారత్ కోసం చేతులు కలిపిన ‘బాహుబలి’