ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో గోల్డీ బ్రార్‌

గోల్డీ బ్రార్‌గా ప్రసిద్ధి చెందిన పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ సతీందర్‌జీత్ సింగ్‌ను గుర్తించి, అరెస్టు చేయడానికి సహాయపడే సమాచారం కోసం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( ఎఫ్‌బీఐ) 1 మిలియన్ డాలర్ల వరకు  (భారత కరెన్సీలో సుమారు రూ.9 కోట్లకు పైగా) బహుమతిని ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాలో పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై అతడిని  ఎఫ్‌బీఐ తన పది మంది మోస్ట్ వాంటెడ్ పరారీలో ఉన్నవారి జాబితాలో చేర్చింది. 
బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఉత్తర అమెరికా కార్యకలాపాలకు గోల్డీ బ్రార్‌ నాయకత్వం వహిస్తున్నట్లు ఎఫ్‌బీఐ ఆరోపిస్తోంది.  ఈ గ్యాంగ్‌కు అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఇతర యూరోపియన్‌ దేశాలు, ఆస్ట్రేలియాలో వేలాది మంది సభ్యులు, అనుబంధ వ్యక్తులు ఉన్నట్లు పేర్కొంది. లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడం, కాల్పులు, కిడ్నాప్‌లు, దాడులు, బెదిరింపులతో డబ్బులు వసూలు చేయడం, డ్రగ్‌ ట్రాఫికింగ్‌ వంటి కార్యకలాపాలకు ఈ ముఠా పాల్పడుతున్నట్లు ఆరోపించింది.

2022 మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో ప్రముఖ గాయకుడు, ర్యాపర్‌ సిద్ధూ మూసేవాలా (శుభ్‌దీప్‌ సింగ్‌ సిద్ధూ) హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ఆదేశాలు ఇచ్చింది తామేనని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించినట్లు ఎఫ్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఈ కేసులో పంజాబ్‌ పోలీసులు గోల్డీ బ్రార్‌పై అభియోగాలు నమోదు చేశారు. భారత్‌లో పలు హత్య కేసులకు సంబంధించి కూడా అతడి కోసం గాలింపు కొనసాగుతోంది. 

2022లోనే అతడి ఆచూకీ కోసం భారత్‌ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించగా, రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ అయింది. భారత కేంద్ర హోంశాఖ కూడా చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌తో అతడికి సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

అమెరికాలో లాస్‌ఏంజెలెస్‌లోని ఫెడరల్‌ కోర్టు 2026 జూలై 1న అతడిపై అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. వ్యవస్థీకృత నేర ముఠాలపై చర్యలకు ఉద్దేశించిన రాకెటియర్‌ ఇన్‌ఫ్లూయెన్స్డ్‌ అండ్‌ కరప్ట్‌ ఆర్గనైజేషన్స్‌ (రికో) చట్టం కింద కుట్ర, ఎక్స్‌టార్షన్‌ ద్వారా వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలిగించే కుట్ర, మాదకద్రవ్యాల పంపిణీకి సంబంధించిన అభియోగాలు నమోదయ్యాయి.

గోల్డీ బ్రార్‌ ముఠా ప్రత్యర్థి డ్రగ్‌ ముఠాల నుంచి కొకైన్‌ను దొంగిలించి అక్రమంగా తరలించినట్లు ఎఫ్‌బీఐ ఆరోపించింది. 2024 మార్చి నుంచి 2025 జూలై మధ్య సుమారు 520 కిలోల కొకైన్‌ను దొంగిలించినట్లు పేర్కొంది. ‘ఆపరేషన్‌ హార్డ్‌బాల్‌’ పేరుతో ఏళ్ల తరబడి సాగిన దర్యాప్తులో గోల్డీ బ్రార్‌ సహచరుల్లో పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపింది.

About The Author