శ్రీశైలం మల్లన్న ఆలయానికి రైలు మార్గం!

* ఏపీలో మూడు కొత్త రైల్వే మార్గాల ప్రతిపాదన 
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే కనెక్టివిటీని మరింత విస్తరించేందుకు మూడు కొత్త రైల్వే మార్గాల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. మార్కాపురం–శ్రీశైలం–సికింద్రాబాద్‌, రాజంపేట–నెల్లూరు, సామర్లకోట–చింతూరు మధ్య మొత్తం 560 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు నిర్మించే అవకాశాలను పరిశీలించాలని దక్షిణ కోస్తా రైల్వేజోన్ అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. 
 
ఈ మార్గాలకు ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌), సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీకి అనుమతి ఇవ్వాలని కోరారు.  సామర్లకోట నుంచి జగ్గంపేట, రంపచోడవరం, మారేడుమిల్లి మీదుగా చింతూరు సమీపం వరకు సుమారు 150 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రస్తుతం రైలు సదుపాయం లేని ఏజెన్సీ ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడుతుంది. 
 
సామర్లకోట, రాజమహేంద్రవరం వైపు నుంచి గిరిజన ప్రాంతాలకు రైలు ప్రయాణం సులభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు 173.61 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్‌కు ఆమోదం లభించింది. సామర్లకోట–చింతూరు మార్గం ఈ లైన్‌తో అనుసంధానమైతే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణ ప్రాంతాల మధ్య రైల్వే రవాణాకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయి. 
 
ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుంచి బొగ్గు, ఇనుప ఖనిజాలను కాకినాడ పోర్టుకు తరలించేందుకు కూడా ఈ మార్గం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. రాజంపేట నుంచి నెల్లూరు వరకు సుమారు 120 కిలోమీటర్ల మేర మరో కొత్త రైల్వే లైన్ నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల మధ్య నేరుగా రైలు మార్గం లేకపోవడంతో ప్రయాణికులు రేణిగుంట మీదుగా వెళ్లాల్సి వస్తోంది.
 
కొత్త లైన్ అందుబాటులోకి వస్తే రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి నెల్లూరుకు ప్రయాణ సమయం, దూరం తగ్గే అవకాశం ఉంది. ఓబుళవారిపల్లె నుంచి కృష్ణపట్నం పోర్టుకు ఇప్పటికే రైల్వే మార్గం ఉన్నప్పటికీ, ఆ మార్గంలో ప్రయాణికుల రైళ్ల నిర్వహణకు సొరంగ భద్రత సహా కొన్ని సమస్యలు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా రాజంపేట–నెల్లూరు లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 
 
దీనివల్ల కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు సరకు రవాణా కనెక్టివిటీ కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఈ మూడు ప్రతిపాదనల్లో భక్తులకు ఉపయోగపడే కీలక మార్గం మార్కాపురం–శ్రీశైలం–సికింద్రాబాద్‌ రైల్వే లైన్. సుమారు 290 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి నేరుగా రైలు సదుపాయం లేదు. 
 
ఈ కొత్త లైన్ నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్‌ వైపు నుంచి తెలంగాణ ప్రాంతాల భక్తులు, మార్కాపురం వైపు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల ప్రయాణికులు రైలులో శ్రీశైలం చేరుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రైలు కనెక్టివిటీ ఏర్పడితే భక్తుల రాకపోకలు పెరగడంతో పాటు స్థానిక పర్యాటక, వాణిజ్య రంగాలకు కూడా ప్రయోజనం కలగవచ్చు. మరోవైపు దొనకొండ–ఒంగోలు మధ్య కొత్త రైల్వే లైన్‌కు సంబంధించి సర్వే, డీపీఆర్‌ తయారీ ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. 

About The Author