రేపే కరీంనగర్ లో బిజెపి మహా పాదయాత్ర… నితిన్ నబిన్ రాక 

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు మద్దతుగా కరీంనగర్‌లో బిజెపి సోమవారం నిర్వహించనున్న ‘మహా పాదయాత్ర’లో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్  పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నితిన్ నబిన్ కరీంనగర్ విచ్చేస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద హెలిప్యాడ్ దిగిన వెంటనే నేరుగా గాంధీ బొమ్మ వద్ద నుండి ప్రారంభమయ్యే మహా పాదయాత్రకు చేరుకోనున్నారు.
 
వైశ్యా భవన్ వద్ద ప్రజా హోరును ఉద్దేశించి నితిన్ నబిన్ ప్రసంగించనున్నారు. ప్రసంగం ముగిసిన వెంటనే వైశ్యాభవన్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గడియారం సెంటర్, శాస్త్రీ రోడ్, భారత్ టాకీస్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు ప్రజలతో కలిసి నితిన్ నబిన్ మహా పాదయాత్ర చేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుండి విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు.

నితిన్ నబిన్ తొలిసారి కరీంనగర్ రానున్న నేపథ్యంలో దాదాపు లక్ష మందితో ‘మహా పాదయాత్ర’ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన్నల్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ ను తోరణాలు, జెండాలతో అందంగా అలంకరించారు. రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులతో  నింపేశారు.

మరోవైపు నితిన్ నబిన్ కు వినూత్న రీతిలో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ కళాకారుల ఆట పాటలు, డప్పు న్రుత్యాలతో నితిన్ నబిన్ కు ఘన స్వాగతం పలుకుతారు. మహా పాదయాత్రలో ప్రముఖ రచయిత ఆకుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని కళా బ్రందం ప్రత్యేకంగా ఆట, పాటలతో అలరించేలా ఏర్పాట్లు చేశారు. 

 
మహా పాదయాత్రకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు యాత్ర పొడువునా రవాణా, మంచినీటి వసతి సౌకర్యాలను కల్పించారు. దాదాపు లక్షకు పైగా మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. వివిధ సామాజిక సంస్థ, సంఘాల ఆధ్వర్యంలోనూ పాదయాత్ర పొడవునా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పాదయాత్ర చేసే వారికి నీళ్లు, మజ్జిగ, ఇతర తినుబండారాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

‘‘సర్’’ పేరుతో రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తూ దేశ ప్రతిష్టకు కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు భంగం కలిగిస్తున్న నేపథ్యంలో  ‘‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం- అరాచకాన్ని అంతం చేద్దాం’’ పేరిట దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో బీజేపీ జాతీయ నాయకత్వం ఈ మహా పాదయాత్ర ర్యాలీలు నిర్వహిస్తోందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో వణుకు పుట్టేలా మహా పాదయాత్రను విజయవంతం కాబోతుందని చెప్పారు.

About The Author