`యలహంక ప్యాలెస్‌’లోకి షర్మిల ప్రవేశం అడ్డుకున్న కోర్టు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య నెలకొన్న కుటుంబ ఆస్తుల వివాదం మరోసారి న్యాయస్థానం ముందుకొచ్చింది. బెంగళూరులోని అత్యంత విలాసవంతమైన యలహంక ప్యాలెస్‌లో తన కుమార్తె అంజలి వివాహం జరిపించేందుకు షర్మిల సన్నాహాలు చేస్తుండగా, ఆమెను ఈ ప్యాలెస్ ప్రాంగణంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటూ న్యాయస్థానంను ఆశ్రయించారు. 
 
బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి కోర్టులో ‘సిలికాన్ బిల్డర్స్ లిమిటెడ్’ సంస్థ పేరుతో ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేయడం ద్వారా వైఎస్ జగన్ బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లోకి తన సోదరి షర్మిల అడుగుపెట్టకుండా అడ్డుకున్నారు. గెస్ట్ హౌస్‌లో తాత్కాలికంగా ఉండటానికి అనుమతి పొందిన షర్మిల, అలంకరణ పనుల నెపంతో బయటి వ్యక్తులను ప్యాలెస్​లోకి పంపుతున్నారని, వారిని నిలువరించక పోతే అక్కడి చరాస్తులకు నష్టం కలిగుతుందని సిలికాన్ బిల్డర్స్‌తో కోర్టులో దావా వేయించారు. 
 
విచారించిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వుల వరకు యలహంక ప్యాలెస్‌లోకి షర్మిల, ఆమెకు సంబంధించిన వ్యక్తులు, ప్రవేశించకుండా నిలువరిస్తూ ఆదేశాలిచ్చింది. షర్మిల తన కుమార్తె అంజిలిరెడ్డి వివాహాన్ని యలహంక ప్యాలెస్‌లో నిర్వహిస్తున్నానంటూ ఆహ్వాన పత్రికలు ముద్రించి బంధుమిత్రులకు పంచారు. అయితే అక్కడ పెళ్లి చేయడానికి వీల్లేదంటూ జగన్ అడ్డుపడ్డారు. 
 
తాను నివసిస్తున్న ప్రాంగణంలో వివాహం చేస్తే భద్రత సమస్యలు తలెత్తుతాయని ఇటీవల షర్మిలకు జగన్ లేఖ రాశారు. ఆ తర్వాత షర్మిల తన కుమార్తె వివాహ వేదికను మరోచోటికి మార్చారు. పెళ్లి పనుల్లో భాగంగా షర్మిల మూడు రోజుల కిందట యలహంక ప్యాలెస్‌కు వెళ్లేందుకు సిద్ధం కావడంతో 
ఆమెను ప్యాలెస్‌లో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు జగన్ సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి భీమిశెట్టి రమేశ్​బాబుతో పిటిషన్ వేయించారు.
ఈ సంస్థలో 2017 ఫిబ్రవరి 16 వరకు వైఎస్ భారతి డైరెక్టర్‌గా ఉన్నారు. భగవత్ సన్నిధి ఎస్టేట్స్ ఎల్ఎల్‌పీ రమేశ్​బాబు, భారతి ప్రస్తుతం డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. భారతి తల్లి ఈ.సి. సుగుణమ్మ 2007 మార్చి 1న 20 ఏళ్ల కాలానికి ప్యాలెస్‌ను తమ సంస్థకు లీజుకు ఇచ్చారని రమేశ్​బాబు తరఫు న్యాయవాది వాదించారు. ప్యాలెస్‌లో పండ్లతోటలు, మొక్కలు, గెస్ట్ హౌస్‌లు, ఇతర కట్టడాల అభివృద్ధికి భారీగా ఖర్చుచేశామన్నారు.
సుగుణమ్మ 2026 ఆగస్ట్​ 27న తన కుమార్తె భారతి, మనుమరాళ్ల పేరున ఈ ప్యాలెస్‌ను గిఫ్ట్ డీడ్ రాసిచ్చారని ఆస్తి హక్కులు వారికి బదిలీ అయ్యాయని కోర్టుకు తెలిపారు.  

About The Author