పాక్ మంత్రి తాజ్ సందర్శనకు అనుమతి నిరాకరణ

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ పర్యావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ఢిల్లీలోని చారిత్రక పురానా ఖిలాలో నవంబర్ 20 నుంచి 22 వరకు నిర్వహిస్తున్న ఎస్‌సీఓ కార్యక్రమాలకు మాత్రమే ఆయన హాజరు కావాలని స్పష్టం చేసింది. అధికారిక సమావేశాలు మినహా ఇతర ప్రాంతాల్లో పర్యటించేందుకు అనుమతి నిరాకరించినట్లు సమాచారం.
 
భారత్ పర్యటనలో భాగంగా ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను సందర్శించాలని ముసాదిక్ మాలిక్ భావించారు. అలాగే ఢిల్లీలోని ప్రముఖ సూఫీ పుణ్యక్షేత్రం నిజాముద్దీన్ దర్గాను కూడా దర్శించుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం సంబంధిత అధికారుల నుంచి అనుమతులు కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు కేటాయించిన వీసా ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనేందుకు మాత్రమే పరిమితమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో వ్యక్తిగత పర్యటనలకు అవకాశం లేకుండా పోయింది

2023లో గోవాలో నిర్వహించిన ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్థాన్ అప్పటి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరయ్యారు. ఆ తర్వాత పాకిస్థాన్‌కు చెందిన మరో మంత్రి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారిగా ప్రాధాన్యం సంతరించుకుంది. 2025లో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. 

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మంత్రి భారత పర్యటనకు రావడం రాజకీయ, దౌత్య వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు సున్నితంగా ఉన్న సమయంలో ఆయన పర్యటనకు సంబంధించిన పరిమితులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

కేంద్రం విధించిన నిబంధనల ప్రకారం ముసాదిక్ మాలిక్ ఢిల్లీలో జరిగే అధికారిక ఎస్‌సీఓ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనాల్సి ఉంది. ఇతర పర్యాటక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలను సందర్శించేందుకు అనుమతి లేకపోవడం ఈ పర్యటనలో కీలక పరిణామంగా మారింది. భారత్, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన పర్యటనపై ప్రత్యేక దృష్టి నెలకొంది.

About The Author