* రూ.40.96 కోట్ల ధాన్యం పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. రూ.40.96 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు వచ్చిన ఆరోపణలపై శుక్రవారం ఉదయం ఖానాపూర్, హైదరాబాద్‌లో రేఖా నాయక్‌కు సంబంధించిన 2 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
ఆమె రైస్ మిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ధాన్యం, బియ్యం నిల్వలు, సరఫరా వివరాలతో పాటు కీలక రికార్డులను పరిశీలిస్తున్నారు. ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో రేఖానాయక్‌కు చెందిన ఏఆర్ఎస్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లు ఉంది. ఈ మిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కేటాయించి మిల్లింగ్ అనంతరం నిర్ణీత పరిమాణంలో బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించేలా ఒప్పందాలు చేసుకుంది.
2022-23, 2023-24, 2024-25 రబీ సీజన్లకు సంబంధించి ఈ ఒప్పందాలు జరిగాయి. అయితే ప్రభుత్వం కేటాయించిన ధాన్యానికి అనుగుణంగా బియ్యాన్ని తిరిగి సరఫరా చేయలేదని పౌరసరఫరాల శాఖ ఆరోపించింది. మిల్లులో, గోదాముల్లో ఉండాల్సిన ధాన్యం, బియ్యం నిల్వలు లెక్కల్లో కనిపించలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు.
మొత్తం 9,639.962 టన్నుల ధాన్యం లెక్కల్లో తేలలేదని, దీని విలువ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకారం సుమారు రూ.40.96 కోట్లుగా అంచనా వేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2022-23 సీజన్లో ఏఆర్ఎస్ మిల్లుకు 6,821.640 టన్నుల ధాన్యం కేటాయించారు.
దీనికి బదులుగా 4,638.715 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా కేవలం 831.071 టన్నులే సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ సీజన్లో 5,482.96 టన్నుల ధాన్యం లెక్కల్లో తేలలేదని ఆరోపించారు. 2023-24 సీజన్లో 7,430.840 టన్నుల ధాన్యం అందించగా 5,052.971 టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది.
కానీ 3,205.269 టన్నుల బియ్యమే ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సీజన్లో 2,717.209 టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. 2024-25 సీజన్లో 2,413.640 టన్నుల ధాన్యం కేటాయించగా 1,641.275 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే 343.200 టన్నుల బియ్యమే సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు.
తనిఖీల సమయంలో మిల్లులో 469.117 టన్నుల ధాన్యం మాత్రమే ఉండగా బియ్యం నిల్వలు లేవని నివేదికలో పేర్కొన్నారు. గత ఆగస్టులో విజిలెన్స్ అధికారులు రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వలు, బియ్యం సరఫరా వివరాలను పరిశీలించగా భారీ మొత్తంలో నిల్వలు లెక్కల్లో తేలలేదని గుర్తించారు. దీంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని నమ్మకద్రోహం, మోసం సంబంధిత సెక్షన్లతో పాటు నిత్యావసర వస్తువుల చట్టంలోని సెక్షన్ 7 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ ఫిర్యాదు, పోలీసుల కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది.
ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఖానాపూర్, హైదరాబాద్‌లో రేఖానాయక్‌కు సంబంధం ఉన్న రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్ ఒప్పందాలు, బియ్యం సరఫరా, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మిల్లుకు కేటాయించిన ధాన్యం పక్కదారి పట్టిందనే ఆరోపణల వెనుక ఆర్థిక లావాదేవీలు, నిధుల వినియోగం వంటి అంశాలపై ఈడీ ఆరా తీస్తోంది.
సోదాల్లో లభించే పత్రాలు, ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది. అయితే రేఖానాయక్‌ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేఖానాయక్ గతంలో బీఆర్ఎస్ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.

More Stories
హిత చింతక్ అభియాన్‌లో ప్రతి హిందువు భాగస్వామి కావాలి
తిరుపరన్కుండ్రంలో 24న దీపాలు వెలిగించేందుకు `సుప్రీం’ అనుమతి
తమిళనాడు పెట్టుబడుల వివరాలు ఆంధ్రాకు లీక్?