యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రి దేవి శుక్రవారం రోజు ఉదయం కన్నుమూశారు. 91 ఏళ్ల వయసు కల్గిన ఆమె ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గర్వాల్ జిల్లాలో ఉన్న తమ పూర్వీకుల నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్లు పౌరీ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) సర్వేష్ కుమార్, జిల్లా సమాచార అధికారి యోగేష్ పోఖ్రియాల్ అధికారికంగా ధ్రువీకరించారు. 
 
సావిత్రి దేవి మరణాన్ని యోగి ఆదిత్యనాథ్ సోదరుడు మహేంద్ర కూడా అధికారికంగా ధ్రువీకరించారు. గత కొంతకాలంగా ఆమె శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 11.50 గంటల సమయంలో ఆమె పరిస్థితి విషమించిందని, వైద్యులను కూడా ఇంటికి పిలిపించి చికిత్స అందించామని చెప్పారు. 
 
అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆమె పౌరీ గర్వాల్‌లోని పూర్వీకుల ఇంటి వద్దే ప్రాణాలు విడిచారని మహేంద్ర స్పష్టం చేశారు. శనివారం ఆమె అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని సమాచారం అందుతున్నప్పటికీ.. దీనిపై కుటుంబ సభ్యులు లేదా అధికారుల నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు. తన తల్లి చివరి చూపు కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పౌరీకి వచ్చే అవకాశం ఉంది.
 
మరోవైపు తల్లి మరణవార్త అందిన సమయంలో యోగి ఆదిత్యనాథ్ తన కర్తవ్య నిబద్ధతను చాటుకున్నారు. ఆ సమయంలో ఆయన గోరఖ్‌పూర్‌లో 50 వేల మంది విద్యార్థులకు ట్యాబ్లెట్లను పంపిణీ చేసే భారీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమంలో ఉండగానే తల్లి కన్నుమూశారన్న తీవ్ర విషాదకర సమాచారం ఆయనకు అందింది. 
 
అయినప్పటికీ ఆయన ఆ కార్యక్రమాన్ని త్వరగా ముగించుకునే వెళ్లాలని, అందులో పాల్గొన్నారు. సీఎం యోగికి తల్లి అంటే అమితమైన ప్రేమ ఉంది. రెండేళ్ల క్రితం సావిత్రి దేవి అనారోగ్యంతో రిషికేశ్ ఎయిమ్స్‌లో చేరినప్పుడు కూడా ఆయన ఆసుపత్రికి వెళ్లి, తల్లితో సమయం గడిపారు. తన కుమారుడు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ సావిత్రీ దేవి ఎప్పుడూ సొంత గ్రామమైన పంచూర్‌లోనే సాధారణ గృహిణిగా జీవనం సాగించారు.
 
సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి అయిన సావిత్రిదేకి ఏడుగురు పిల్లలు. అందులో యోగీజీ ఐదో వారు కాగా, ఆయన కుటుంబం మొత్తం పౌరీ గర్వాల్ జిల్లాలోని పంచూర్ గ్రామంలోనే నివసిస్తోంది. గతంలో 2020 ఏప్రిల్ 20వ తేదీన యోగి తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ 89 ఏళ్ల వయసులో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. 
 
అయితే ఆ సమయంలో దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉండటం, ముఖ్యమంత్రిగా రాష్ట్ర బాధ్యతలు నిర్వహించాల్సి రావడంతో యోగి ఆదిత్యనాథ్ తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలే కపోయారు.  

 

About The Author