తమిళనాడు పెట్టుబడుల వివరాలు ఆంధ్రాకు లీక్?

* 15 మంది అధికారులను తొలగించిన సీఎం విజయ్‌

తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల రహస్య సమాచారం ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వానికి చేరిందన్న వార్త రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే వెల్లడించిన కథనం ప్రకారం తమిళనాడు ప్రభుత్వానికి చెందిన పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ నుంచి కీలకమైన సమాచారం బయటకు లీకైనట్లు తెలుస్తోంది.
 
పెట్టుబడుల ప్రతిపాదనలు, వివిధ కంపెనీలతో జరుగుతున్న చర్చలు, రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇతర రాష్ట్రాలకు చేరాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన తమిళనాడు ప్రభుత్వం సుమారు 15 మంది అధికారులను విధుల నుంచి తొలగించినట్లు ఆ కథనంలో పేర్కొంది. 
 
రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం బయటకు వెళ్లడం పారిశ్రామిక రంగంలో కలకలం రేపుతోంది. అయితే డేటా లీక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దాని వెనుక ఉన్న వ్యక్తుల పాత్రపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తమిళనాడు ప్రభుత్వం తొలగించిన అధికారులలో ముగ్గురు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.
 
తమిళనాడులోపెట్టుబడులను ప్రోత్సహించే ప్రయత్నాలను దెబ్బతీయడానికి పెద్ద కుట్ర జరిగిందా? పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. కీర్తన నేతృత్వంలోని శాఖను లక్ష్యంగా చేసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తమిళనాడు నుంచి ఏపీకి పెట్టుబడుల సమాచారం చేరిందన్న ఆరోపణలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. 
 
ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన హ్వాషిన్, సియోన్, ఐవామెట్ సంస్థలకు సంబంధించిన సుమారు రూ.1,600 కోట్ల పెట్టుబడులు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఈ పెట్టుబడుల వ్యవహారానికి, తాజా డేటా లీక్ ఆరోపణలకు ఏమైనా సంబంధం ఉందా? అన్న చర్చ మొదలైంది. 
 
మొదట తమిళనాడులో పెట్టుబడులకు ముందుకు వచ్చిన కొన్ని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. తొలగించిన సీనియర్‌ అధికారుల్లో చాలా మంది 2016 నుంచి 2021 వరకు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీరు తమ పదవుల్లో కొనసాగారు.
 
తమిళనాడు పెట్టుబడి ప్రోత్సాహక సంస్థ అయిన ‘గైడెన్స్ తమిళనాడు’ ఆ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ప్రభుత్వ విభాగంలో చాలా కాలంగా పని చేస్తున్న సీనియర్‌ అధికారులు కీలకమైన పెట్టుబడుల రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చేరవేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, తమిళనాడుతో నెలకొన్న పోటీ నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.  

కాగా, డీఎంకే నాయకుడు, తమిళనాడు మాజీ పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌బీ రాజా ఈ వివాదంపై  ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ దశాబ్దాలుగా నిర్మితమైన ఒక సంస్థను రాజకీయ వివాదంలోకి ప్రభుత్వం లాగుతోందని ఆరోపించారు. ‘తమిళనాడుకు చెందిన అత్యుత్తమ మేధావుల కృషి ఫలితంగా ఏర్పడిన ఒక సంస్థను, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న అపరిపక్వమైన, సోషల్ మీడియా ఆధారిత రాజకీయాల ద్వారా దెబ్బతీయడం చాలా బాధాకరం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

అలాగే కొంతమంది ఉద్యోగులు సంస్థను వీడటం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం దెబ్బతింటుందనే ప్రభుత్వ వాదనను కూడా టీఆర్‌బీ రాజా ప్రశ్నించారు. ‘తమిళనాడు పెట్టుబడుల వ్యవస్థ, పారిశ్రామిక వాతావరణం అంత బలహీనంగా ఉన్నాయని ఈ ప్రభుత్వం భావిస్తోందా?’ అని ఆయన నిలదీశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ కూడా ఈ ఆరోపణలను ఖండించింది

About The Author